Ganta Srinivasa Raoటిడిపి అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఓ వెలుగు వెలిగిన గంటా శ్రీనివాసరావు పార్టీ అధికారం కోల్పోగానే నేటి వరకు పార్టీకి దూరంగా ఉండిపోయారు. ఆయన కారణాలు ఆయనకి ఉండవచ్చు కానీ ఎట్టకేలకి టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌తో ఇటీవల 40 నిమిషాల సేపు భేటీ అయిన తర్వాత టిడిపిలో కొనసాగాలని నిర్ణయించుకొన్నారు. కనుక ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన ఎన్టీఆర్‌ 27వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఎన్టీఆర్‌ అనేవి కేవలం మూడక్షరాలు మాత్రమే కాదు అవి రాజకీయాలలో పెను వైబ్రేషన్స్ సృష్టించాయి. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి తెలుగువారి ఆత్మగౌరవం కోసం అలుపెరుగని పోరాటం చేశారు. ఆయన స్పూర్తితో నేటికీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టిడిపి ప్రజా సమస్యలపఓ పోరాడుతూనే ఉంది. నారా లోకేష్‌ ఈ నెల 27వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 400 రోజుల పాటు 4,000 కిమీ పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. దేశానికి యువత వెన్నెముక వంటిది. రాష్ట్రంలో యువత ఎన్నో ఇబ్బందులు పడుతోంది. వారందరికీ ధైర్యం చెప్పి చైతన్య పరిచేందుకు నారా లోకేష్‌ పాదయాత్ర చేపట్టబోతున్నారు. నారా లోకేష్‌ పాదయాత్రకి అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన పాదయాత్ర విజయవంతం చేసేందుకు యధాశక్తిన కృషిచేస్తాను,” అని గంటా శ్రీనివాసరావు చెప్పారు.

ఒకానొక సమయంలో వైసీపీలో చేరేందుకు ప్రయత్నించి సాధ్యం కాక ఇంతకాలం పార్టీకి దూరంగా ఉంటున్న గంటా శ్రీనివాసరావు ఎట్టకేలకి మైండ్ ఫిక్స్ చేసుకొని టిడిపిలోనే కొనసాగాలని నిర్ణయించుకొన్నందుకు చాలా సంతోషమే. ఇంకా విజయవాడలో టిడిపి ఎంపీ కేశినేని నాని డ్రామా ఒకటి కొనసాగుతోంది. తనకి నచ్చని వారికి టికెట్స్ ఇస్తే పార్టీలో ఉండబోనని ఆయన బెదిరిస్తున్నారు. మరి ఆయన కధ ఎలా ముగుస్తుందో చూడాలి.