గత కొన్ని రోజులుగా గంటా శ్రీనివాసరావు పార్టీ మారబోతున్నారని, 15 మంది ఎమ్మెల్యేలతో కొలంబోలో క్యాంపు నిర్వహిస్తున్నారని ఏ క్షణమైనా టీడీపీ శాసనసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తారని వార్తలు వచ్చాయి. గంటా శ్రీనివాసరావు మరో 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరతారని ఊహాగానాలు వినిపించాయి. గంటా కూడా అప్పటి నుండి దీని మీద స్పందించకపోవడం, శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.
“నేను పార్టీ మారుతానంటూ మీడియా మరియు సోషల్ మీడియాలో ప్రసారం చేసుకుంటున్నారు. ఆ వార్తలకు నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎన్నికల ముందు, తర్వాత మరియు ఇప్పుడు కథనాలు వచ్చాయి, ఏప్పుడు అలాంటి అసత్య కథనాలు వస్తూనే ఉంటాయి, @JaiTDP పార్టీ మారే ప్రసక్తే లేదు,” అని ఆయన ట్వీట్ చేశారు. దీనితో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. తాను దైవదర్శనం కోసమే కొలంబో వెళ్లానని స్పష్టం చేసిన గంటా శ్రీనివాసరావు… పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను ఖండించారు.
అయితే చంద్రబాబు విదేశీ పర్యటన నుండి తిరిగి వచ్చిన కొన్ని గంటలలోనే గంటా స్పందించడం గమనార్హం. అందరు ఎమ్మెల్యేలతోనూ, సీనియర్ నేతలతోనూ చంద్రబాబు మాట్లాడతారని సమాచారం. మొన్న కాకినాడలో సమావేశమైన కాపు నేతలతో కూడా చంద్రబాబు మాట్లాడే అవకాశం ఉందని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరి, టీడీపీ పార్లమెంట్ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే.