Ganta Srinivasa Rao-విశాఖ ఉత్తర నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారతారని ఎన్నికల నాటి నుండీ వదంతులు వ్యాపిస్తున్నాయి. ఒకసారి బీజేపీ అని, ఒకసారి వైఎస్సార్ కాంగ్రెస్ అని అంటున్నారు. అయితే అటువంటిది ఏదీ జరగలేదు. అయితే ఆయన శాసనసభకు కూడా హాజరు కాకపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయి.

గంట అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాలలో స్థానికంగా పాల్గొంటున్నారు. తన నియోజకవర్గం వరకూ మాత్రమే పరిమితం అవుతున్నారు. నిన్న విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ఆయన నిర్వహించారు. వార్డుల విభజన, రిజర్వేషన్ కేటగిరి మరియు ఇతర అంశాలపై వార్డుల వారీగా త్వరలో సమావేశాలు నిర్వహించాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పటిష్ఠత పేరిగేలా అహర్నిశలు కృషి చేయాలని స్థానిక నేతలకు, క్యాడర్ కు సూచించారు.

అయితే టీడీపీలో గంట ఉన్నట్టా? లేనట్టా? అనే దాని గురించి టీడీపీ వర్గాలలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. “గంట టీడీపీలోనే ఉంటారు. అయితే మీడియాలో గానీ, శాసనసభలో గానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడాలనుకోవడం లేదు. సభకు వస్తే మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి రావడం లేదు. అయితే పార్టీ పటిష్టతకు స్థానికంగా పని చేస్తారు,” అని ఒక సీనియర్ నేత చెప్పుకొచ్చారు.

వచ్చే స్థానిక ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చాలా కీలకమైనవి. టీడీపీ అమరావతికి అనుకూలంగా ఉండడంతో విశాఖ, ఉత్తరాంధ్రలో నష్టం జరగకుండా స్థానిక నేతలు అక్కడ స్థానికంగా పని చేస్తున్నారు. స్థానిక ఎన్నికలలో మెరుగైన ఫలితాలతో ప్రభుత్వానికి చెక్ చెప్పాలనే ఉద్దేశంతో ఉన్నారు.