Ganta Srinivasa Rao - KTRశత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు బీజేపీ పై యుద్ధంలో భాగంగా మంత్రి కేటీఆర్ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఈ ఉద్యమానికి మద్దతుగా మొదటగా రాజీనామా చేసిన టీడీపీ ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు హైదరాబాద్ వెళ్లి కేటీఆర్ ని కలిసొచ్చారు.

విశాఖ ఉక్కు కోసం చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపిన కేటీఆర్ ని కలసి ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా విశాఖ ఉక్కు ఉద్యమానికి ప్రత్యక్ష మద్దతు తెలియజేయాలని కోరారట. అసెంబ్లీ సమావేశాల తరువాత సీఎం కేసీఆర్ తో చర్చించి..తెరాస పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, పార్లమెంట్ సబ్యులు మరియు మంత్రులతో కలసి వచ్చి ఉద్యమంలో పాల్గొంటామని కేటీఆర్ గంటకు హామీఇచ్చారట.

నిజంగా అంత భారీ స్థాయిలో తెరాస నేతలు కదిలొచ్చి విశాఖలో ఉద్యమానికి మద్దతు ఇస్తే ఖచ్చితంగా ఉద్యమానికి కొత్త బలం చేకూరుతుంది. జీవీఎంసి ఎన్నికల తరువాత ఉద్యమం కాస్త స్తబ్దుగా మారిన సంగతి తెలిసిందే. మరోవైపు… ప్రైవేటీకరణపై మనస్తాపం చెందుతూ శ్రీనివాసరావు అనే స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఒక సూసైడ్ నోట్ విడిచి పెట్టి అదృశ్యం అయ్యారు.

“32 మంది ప్రాణ త్యాగాల ప్రతిఫలం ఈ ఉక్కు కర్మాగారం.ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటుపరం కానివ్వద్దు. నేను నా ప్రాణాన్ని ఈ ఉక్కు ఉద్యమం కొరకు త్యాగం చేస్తున్నాను. ఈ రోజు ఫర్నేస్‌లో అగ్నికి ఆహుతి కావడానికి 5:49 నిమషాలకు మూహుర్తం ఉంది కాబట్టి ఈ పోరాటానికి ప్రాణత్యాగం నా నుండి మొదలు కావాలి’’ అంటూ రాశారు. శ్రీనివాసరావు కోసం పోలీసులు గాలిస్తున్నారు.