Ganta Srinivasa Rao joining ysrcpటీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు పార్టీ మారే ముహుర్తం ఖ‌రారైందని వార్తలు వస్తున్నాయి. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు చేసినట్టే ఆయన స్వతంత్ర ఎమ్మెల్యేగా తనను తాను ప్రకటించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆగ‌స్టు 9న ఆయన ముఖ్యమంత్రి జగన్ ను కలవనున్నట్టు తెలుస్తోంది.

టీడీపీలో రాజ‌కీయ జీవితం ప్రారంభించిన గంటా.. ఆత‌ర్వాత ప్ర‌జారాజ్యంలో చేరారు. 2009లో ప్రజారాజ్యం త‌ర‌పున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్ర‌జారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావ‌డంతో… మంత్రి కూడా అయ్యారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత మ‌ళ్లీ టీడీపీ గూటికి చేరారు. 2014 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ త‌ర‌పున‌ గెలిచి మ‌రోసారి మంత్రి కూడా అయ్యారు.

అయితే గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోవ‌డంతో.. కొంత‌కాలంగా ఆ పార్టీకి అంటీముట్ట‌న‌ట్టుగా ఉంటున్నారు. దీంతో అప్ప‌టి నుంచే ఆయ‌న వైసీపీలో చేర‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతూ వ‌స్తోంది. ఇటీవలే వరకు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు గంటా పై పలు విమర్శలు చేస్తూనే ఉన్నారు.

ఇటీవలే స్కూల్ పిల్లల కోసం కొన్న సైకిళ్ళలో పెద్ద ఎత్తున అవినీతి చేసారంటూ కూడా ఆరోపించారు. అయితే ఆగస్టు 9న ముఖ్యమంత్రి తో భేటీతో పునీతం కానున్నారు. గంటా చేరిక ఉత్తరాంధ్రకు చెందిన ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ లకు ఇష్టం లేదని సమాచారం.