Pawan-Kalyan's-Filmy-Remark-Sets-Twitter-Afire!!ఏపీ మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు జనసేనలోకి రావాలని అనుకున్నారా? లేక ఆ పార్టీ నేతలే ఆహ్వానించాలని అనుకున్నారో తెలియదు కాని దానిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. గంటా ను జనసేనలోకి రమ్మని ఆహ్వానించబోమని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. అయితే తనకు ఆయనపై కోపం లేదని, ఆయన ఆలోచనలు జనసేనకు సరిపడవని పవన్ అన్నారు.

గంటా లాంటి వ్యక్తులు పక్షుల్లా వచ్చి ఎగిరిపోతారు. అలాంటి పక్షులను నమ్మను అని కూడా వ్యాఖ్యానించారు. గంటాను అప్పట్లో ప్రజారాజ్యం లోకి తీసుకున్నారు అయితే ప్రజారాజ్యం విలీనం అయ్యేవరకు ఆ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ లో తన గొయ్యి తానే తవ్వుకున్నప్పుడు అందరిలాగే ఆయన కూడా తన దారి తాను చూసుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ కు గంటా కు ఎక్కడ చెడిందో మరి. అలాగని పవన్ కళ్యాణ్ తమ పార్టీలోకి జంప్ జిలానీల ను తీసుకోవడం లేదా అంటే అదీ లేదు.

దీనితో గంటాకు పవన్ కళ్యాణ్ కు మధ్య ఇంకేదో జరిగినట్టు తెలుస్తోంది. మరో వైపు రాజకీయాల గురించి పవన్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.
2019లో పదునైన వ్యూహంతో ఏపీ అసెంబ్లీలోకి జనసేన అడుగు పెడుతుంది. నీతిపరులు, అవినీతిపరులు అని విడదీసుకుంటూ పోతే రాజకీయాలు చేయలేం. రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే ఆ బురదలో దిగక తప్పదు. అందులో కమలంలా జనసేనను వికసింపజేస్తాం. అయితే అన్ని రాజకీయ పార్టీలు చెప్పే మాట కదా ఇది. వెన్నుపోటు పొడిపించుకునేంత బలహీనుడిని కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. బహుశా సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ గురించి పేలుతున్న జోకులు గురించి ఈ వ్యాఖ్య అయ్యి ఉండవచ్చు.