Ganta Srinivasa Rao comments on Visakhapatnam Steel privatisationఇటీవలే ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చెయ్యనున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. ఆ తరువాత దానిని కేంద్ర కాబినెట్ కూడా ఒకే చేసింది. ఈ నిర్ణయంపై కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు భగ్గుమంటున్నాయి. “విశాఖ ఉక్కు కర్మాగారం దేశంలోని మిగతా కర్మాగారాల లాగా కేవలం ఒక పరిశ్రమ గా మాత్రమే చూడొద్దు. విశాఖ ఉక్కు మా ఆత్మ గౌరవం, మా విశాఖ ప్రజల ఉఛ్వాస నిశ్వాస. మా నగరం పేరే ఉక్కు నగరం,” అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.

కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఢిల్లీలో రైతులు చేసిన ఉద్యమం కంటే, 100 రెట్లు ఉద్యమం, తీవ్రత చవి చూడాల్సి వస్తుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఐదు కోట్ల ఆంధ్రులు, 20 కోట్ల తెలుగు వాళ్ళు ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రజల ఉచ్ఛ్వాస నిశ్వాసలతో సమానం’’ అంటూ గంటా ట్వీట్ చేశారు.

మిగతా పార్టీల రాజకీయ నాయకులు కూడా ఇదే రకమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు దీనిపై కొత్త వాదన వినిపిస్తుంది. అమరావతిలో రైతుల గొంతు కోసి ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ ప్రకటించినప్పుడు మిగతా ప్రాంతాల వారు పట్టించుకున్న పాపాన పోలేదు. కొద్ది మంది రైతుల సమస్య అని గాలి కొదిలేశారు. ఇప్పుడు మీకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఆంధ్రులందరిదీనా అని కొంత మంది ప్రశ్నిస్తున్నారు.

గతంలో అన్ని ప్రాంతాల వారూ ఒక్క తాటి మీద ఉండకపోవడం వల్లే అమరావతి ఉద్యమం పల్చబడింది. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా అదే తప్పు పునరావృతం అయ్యే అవకాశం లేకపోలేదు. ప్రజల మధ్య ఐక్యత లేనంత కాలం ఇటువంటి విషయంలో ప్రభుత్వాలు తాము చెయ్యాలనుకున్నదే చేసేయ్యగల్గుతాయి.