Ganta Srinivasa Rao  మంత్రి గంటా శ్రీనివాసరావు చిరంజీవి సన్నిహితుడు. చిరంజీవితో పాటు కాంగ్రెస్ లోకి వెళ్ళి అక్కడ మంత్రి అయ్యి ఆ తరువాత టీడీపీలో చేరారు. అయినా చిరంజీవి కుటుంబంతో ఆయన ఎప్పుడు సన్నిహిత సంబంధాలే ఉండేలా చూసుకున్నారు. అయితే ఆయన తాజాగా పవన్ కళ్యాణ్ పైన ఘాటు విమర్శలు చేసారు.

పవన్ ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ అవాస్తవాలు ప్రచారం చేశారని అన్నారు. ప్రత్యేక హోదాపై దేశం మొత్తం తిరిగి మద్దతు కూడగడతానన్న పవన్ పత్తా లేకుండా పోయారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి కేంద్రం సాయం చేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదిక ఇస్తే.. దానిమీద పన్‌ నోరు మెదపడం లేదని, కేంద్రంపై పల్లెత్తు మాట అనే ధైర్యం పవన్‌కు లేదని విమర్శించారు.

మీ రాజకీయ పార్టీ రహస్య ఏజెండా ఏమిటి. మీ పొత్తు ఎవరితో అని పవన్‌ను ప్రశ్నించారు. ‘గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడానికి మీరు సాయం చేశారు. దానిని అంగీకరిస్తున్నాం. కానీ మీరు లేనప్పుడు కూడా టీడీపీ గెలిచింది’ అని గంటా శ్రీనివాసరావు అన్నారు. నిన్నటిదాకా గంటా జనసేనలో చేరే అవకాశం ఉందని వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఈ విమర్శలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.