Ganta_Srinivas_VV_Lakshminaryanaహైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద విశాఖలో ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు వచ్చినప్పుడు టిడిపి సీనియర్ నేత గంటా శ్రీనివాస రావుని, జనసేన మాజీ నేత లక్ష్మినారాయణ (సీబీఐ మాజీ జేడీ)లతో భేటీ అవడం రాష్ట్ర రాజకీయాలలో మళ్ళీ కొత్త చర్చ మొదలైంది. ఇప్పటికే తోట చంద్రశేఖర్‌ తదితర కాపు నేతలు హైదరాబాద్‌ వెళ్ళి బిఆర్ఎస్‌ కండువాలు కప్పుకొని వచ్చారు. కనుక ఏపీలో బిఆర్ఎస్‌ని విస్తరించాలనే వారి ప్రయత్నాలలో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద విశాఖలో గంటా, లక్ష్మీనారాయణలతో భేటీ అయ్యుండవచ్చు.

గంటా శ్రీనివాసరావు టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌తో భేటీ అయిన తర్వాత మళ్ళీ టిడిపిలో కొనసాగుతానని ప్రకటించినప్పటికీ ఇంతవరకు ఆయన విశాఖలో టిడిపి కార్యక్రమాలు ఏవీ చేపట్టలేదు. పాల్గొనలేదు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినవారే కనుక తోట చంద్రశేఖర్‌ ఆయనని బిఆర్ఎస్‌లోకి రప్పించేందుకు ప్రయత్నిస్తే విచిత్రం కాదు.

ఇక లక్ష్మినారాయణ గత ఎన్నికలలో జనసేన తరపున విశాఖ నుంచి లోక్‌సభకి పోటీ చేసి ఓడిపోయాక పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఇంతవరకు ఏ పార్టీలో చేరలేదు. మళ్ళీ విశాఖ నుంచే లోక్‌సభకి పోటీ చేయాలనుకొంటున్నారు. ఆయన కూడా కాపు సామాజికవర్గానికి చెందినవారే.

కనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద వారిద్దరినీ ఊరికే వెళ్ళి కలిశారనుకోలేము. ఒకవేళ మర్యాదపూర్వకంగా కలవాలంటే విశాఖ జిల్లాలో వందలమంది నాయకులున్నారు కానీ వారెవరినీ కలవలేదు. అంటే వారిరువురినీ బిఆర్ఎస్‌లోకి ఆహ్వానించేందుకే కలిసి ఉంటారని భావించవచ్చు.

ఆంధ్రా ప్రజలలో తెలంగాణ సిఎం కేసీఆర్‌ పట్ల మిశ్రమ స్పందన ఉంది. ఆయన తన రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకొంటున్నారని, ఏపీని కూడా ఆయన అదేవిదంగా అభివృద్ధి చేస్తారని నమ్మేవారూ ఉన్నారు. తమ అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విడగొట్టి ఏపీకి దయనీయ పరిస్థితులు కల్పించినందుకు చాలా మంది ప్రజలు కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కనుక కేసీఆర్‌ నేతృత్వంలో ఏపీలో అడుగుపెడుతున్న బిఆర్ఎస్‌ పార్టీని ఆంధ్రా ప్రజలు ఏమేరకు ఆదరిస్తారో తెలీదు.

కానీ గంటా శ్రీనివాసరావు, జేడీ లక్ష్మినారాయణ బిఆర్ఎస్‌లో చేరితే అది రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడమే అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే వచ్చే ఎన్నికలలో వైసీపీ, టిడిపిల మద్య భీకరపోరు జరుగబోతోంది. కనుక ప్రజలు ఈ రెండు పార్టీలలో దేనినో ఓ దానిని ఎంచుకొంటారు తప్ప ఏపీతో సంబంధమే లేని బిఆర్ఎస్‌కి ఓట్లేయకపోవచ్చు.

వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్‌ ఏపీలో పోటీ చేస్తే ఓట్లు చీలి స్పష్టమైన తీర్పు రాకపోతే, కేసీఆర్‌కి, బిఆర్ఎస్‌ పార్టీకి ఎటువంటి నష్టమూ జరుగదు కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మాత్రం తీరని నష్టం జరుగుతుంది. ఇప్పటికే ఓ ప్రయోగశాలగా మారిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మరో 5 ఏళ్ళపాటు ప్రయోగాలు భరించే స్థితిలో లేదు. ఈవిషయం ప్రజలకి కూడా తెలుసు. కనుక బిఆర్ఎస్‌ వైపు మొగ్గు చూపకపోవచ్చు. అసలు బిఆర్ఎస్‌కి ఆంధ్రా ప్రజలు ఎందుకు ఓట్లు వేసి గెలిపించాలి? అనే ప్రశ్నకు సమాధానం ఉండదు.