Ganta-Sinivasa-Raoఅనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ పార్టీని వీడటానికి సిద్ధం అవుతున్నారు. ఆయన భీమిలి సీటు ఆశిస్తుంటే దానికి చంద్రబాబు సానుకూలంగా స్పందించలేదు. అయితే వైఎస్సాఆర్ కాంగ్రెస్ వెంటనే స్పందించి పార్టీలోకి వస్తే అవంతి కోరుకున్న భీమిలి అసెంబ్లీ టికెట్టే కాకుండా మంత్రి పదవి కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దీనితో ఈ నెల 24న అవంతి జగన్ సమక్షంలో పార్టీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. అవంతి కోసం భీమిలి సీటు వదులుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

మరో వైపు ఇదే విషయాన్ని మంత్రి అధిష్ఠానానికి స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే అధిష్టానం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. ఒక వర్గం ఇదంతా అవంతి ద్వారా గంటా ఆడిస్తున్న నాటకమా అని కూడా అనుమానిస్తున్నారు. గతంలో గంటా తో పాటు ప్రజారాజ్యం నుండి కాంగ్రెస్ కు, కాంగ్రెస్ నుండి టీడీపీకి వచ్చారు అవంతి. ఇద్దరూ మంచి మిత్రులు. గతంలో భీమిలి అసెంబ్లీ టికెట్ అవంతి ఆశించినప్పటికీ అనకాపల్లి ఎంపీగా అధిష్టానం బరిలోకి దింపిందని తెలుస్తోంది.

ఈసారైనా భీమిలి సీటిస్తారని ఆశించినప్పటికీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆగ్రహంగా ఉన్నారట. అయితే అవంతి ఈ సారి అనకాపల్లి నుండి పోటీ చేసినా గెలవడం కష్టమని, వెళ్ళిపోతేనే మంచిదని టీడీపీ భావిస్తోందట. ఆయన వెళ్ళిపోతే సబ్బం హరిని పార్టీలోకి తీసుకువచ్చి అనకాపల్లి ఎంపీగా పోటీ చెయ్యాలని అధిష్టానం అభిప్రాయంగా తెలుస్తుంది. కొణతాల రామకృష్ణ గనుక పార్టీలోకి వస్తే ఆయనకు కూడా అనకాపల్లి సీటు ఇచ్చే అవకాశం ఉంది.