Ganja-in-Andhra-Pradeshడైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజన్స్ (డీఆర్ఐ) ‘స్మగ్లింగ్ ఇన్‌ ఇండియా’ అనే పేరుతో ఓ నివేదిక రూపొందించగా దానిని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఢిల్లీలో విడుదల చేశారు. ఆ నివేదికలో దేశంలో 2020-21లో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే గంజాయి తదితర మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయని పేర్కొంది. ఏపీలో అత్యధికంగా 18,268 కేజీలు, త్రిపురలో 10,105 కేజీలు, అస్సోంలో 3,633 కేజీలు, తెలంగాణ రాష్ట్రంలో 1,012 కేజీల మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయని డీఆర్ఐ ఆ నివేదికలో పేర్కొంది. ఏపీలో గంజాయి, తెలంగాణలో హెరాయిన్ ఎక్కువగా పట్టుబడుతున్నట్లు నివేదికలో పేర్కొంది.

గత రెండు మూడేళ్ళుగా దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే ఉంటున్నాయి. గంజాయి ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ సొమ్ము సంపాదించే అవకాశం ఉండటమే దీనికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు భారీగా పెంచేయడంతో మందుబాబులు మద్యం కొన్నాలేక గంజాయికి అలవాటుపడి ఉండవచ్చు. కారణాలు ఏవైనప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలకి కేంద్రంగా మారిందని తాజా నివేదిక స్పష్టం చేస్తోంది.

అయితే ఆ నివేదిక అర్దం అది కాదని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత సరికొత్త భాష్యం చెప్పారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాలు భారీగా పట్టుబడుతున్నాయంటే దానార్దం వాటి ఉత్పత్తి, పంపిణీ పెరిగిపోతున్నాయని ఎవరైనా అనుకొంటారు. కానీ ఆమె మాత్రం మాదక ద్రవ్యాలను కట్టడి చేయడంలో తమ ప్రభుత్వ చిత్తుశుద్ధికి, పోలీస్, ఎక్సైజ్ శాఖలు సమర్దతకి అద్దం పడుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, ఎర్ర చందనం స్మగిలింగ్‌ని కట్టడి చేయడంలో గత టిడిపి ప్రభుత్వం విఫలం అయ్యిందని కానీ తమ ప్రభుత్వం సమర్ధంగా అడ్డుకోంటోంది గనుకనే డీఆర్ఐ నివేదికలో ఈవిదంగా పేర్కొందని తానేటి వనిత అన్నారు. మారుమూల గ్రామాలలో గంజాయి సాగునే జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్న గిరిజనులకు కూడా నచ్చజెప్పి వేరే వృత్తులు చేపట్టేదుకు ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అంటే రాష్ట్రంలో గంజాయి సాగవుతుండటం, రవాణా అవుతుండటం రెండూ నిజమేనన్న మాట! గంజాయి సాగుని, మాదక ద్రవ్యాల సరఫరాని అరికట్టలేకపోతున్నందుకు సిగ్గుపడాలి కానీ ఎన్ని కేజీలు పట్టుకొంటే అంత గొప్ప అని చెప్పుకోవడం విడ్డూరమే కదా?