Gangula Kamalakar warning to Sajjala Ramakrishna Reddyఏపీ, తెలంగాణ మంత్రుల మద్య మొదలైన మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. “కేసీఆర్‌కు, హరీష్‌ రావుకి మద్య ఏమైనా గొడవలుంటే మీరూ మీరూ చూసుకోవాలి కానీ మా జోలికి రావద్దంటూ,” సజ్జల వార్నింగ్ ఇచ్చారు. దానిపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ అంతకంటే ఘాటుగా స్పందించారు.

“మీకు (సజ్జల రామకృష్ణారెడ్డికి) పచ్చటి కుటుంబాలలో చిచ్చు పెట్టే అలవాటుంది కనుకనే వైసీపీ కుటుంబంలోకి ప్రవేశించి తల్లీ, చెల్లి, అన్నని విడగొట్టారు. అదే అలవాటుతో ఇప్పుడు మా టిఆర్ఎస్‌ కుటుంబం (కేసీఆర్‌, హరీష్ రావు)లో కూడా చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. కానీ మీ ప్రయత్నాలు మా దగ్గర పనిచేయవు. మా అధినేత జోలికి వస్తే ఊరుకోము. మా రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని, అనేక సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నామని చెప్పేందుకే హరీష్‌ రావు ఏదో మాట వరసకి అన్నారు తప్ప ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యంతో అనలేదు. కానీ మీరు, మీ మంత్రులు మమ్మల్ని, మా అధినేతను కించపరిచేవిదంగా మాట్లాడుతున్నారు. ఇటువంటి మేము ఎంతమాత్రం సహించబోము. మాజోకివస్తే ఊరుకోము… మాసంగతి తెలుసు కదా?” అని ఘాటుగా బదులిచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులను చాలా బాగా చూసుకొంటోందని చెప్పడానికి ఏపీలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి హరీష్‌ రావు మాట్లాడారు. కనుక ఏపీ మంత్రులు కూడా అదేవిదంగా తెలంగాణ ప్రభుత్వ విధానాల గురించి నిశిత విమర్శలు చేసి ఉంటే అందరూ హర్షించేవారు. కానీ మామా, అల్లుళ్ళ మద్య ఏం గొడవలున్నాయో… అంటూ అనుమానం వ్యక్తం చేస్తూ మాట్లాడటం ద్వారా అంతర్గతంగా వారి మద్య ఏదో జరుగుతోందనే సంకేతాలు తెలంగాణ ప్రజలకు పంపారు. ఇదే టిఆర్ఎస్‌ ఆగ్రహానికి కారణం. అందుకే ముందు మీ కొంపలో మంటలు ఆర్పుకోండని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ హితవు పలికారనుకోవచ్చు. ఇంకా ఈ యుద్ధాన్ని ఇలాగే కొనసాగిస్తే ఇరువర్గాలకి మంచిది కాదు కనుక ఇక్కడితో ముగిస్తే మంచిది.