etela rajender kcr
ఈటల రాజేందర్ 100 కోట్ల స్కామ్ తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. మొదట్లో కాస్త ఆచితూచి స్పందించిన ఈటల కూడా మాటల జోరు పెంచారు. తెలంగాణ తెచ్చింది కుటుంబ పాలన కోసమా ? తెలంగాణలో మరో ఉద్యమం మొదలైంది అంటూ తన భవిష్యత్తు విధానంపై ఆయన చెప్పకనే చెప్పారు.

మరోవైపు… ఈటల ను టార్గెట్ చెయ్యడానికి తెరాస నేతలకు, మంత్రులకు ముఖ్యమంత్రి ఫుల్ పర్మిషన్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. “ఈటల రాజేందర్ మేకవన్నె పులి. ఈటల రాజేందర్ పచ్చి అబద్ధాల కోరు. బీసీ ముసుగులో ఉన్న పెద్ద దొర. ఈటల పార్టీ పెట్టినపుడు పార్టీలో లేరు.. అయిన 2003 లో టీఆర్ఎస్ లో చేరారు,” అంటూ విమర్శించారు మంత్రి గంగుల కమలాకర్.

ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. 2014లో తెరాస అధికారంలోకి వచ్చిన నాటి నుండి నిన్న మొన్నటి వరకు ఈటల ఇప్పుడు ఆయన చెబుతున్న కుటుంబ పాలనలోనే మంత్రి పదవి ఎంజాయ్ చేశారు. తన పదవి పోగానే ఆయనకు కేసీఆర్ ది కుటుంబ పాలన అని తెలిసొచ్చింది. ఉన్నఫళంగా తెలంగాణలో మరో ఉద్యమం మొదలుపెట్టాలనే కోరిక కూడా కలిగింది.

మరోవైపు… ఈటల పార్టీ పెట్టినపుడు పార్టీలో లేరు.. అయిన 2003 లో టీఆర్ఎస్ లో చేరారు అంటూ ప్రకటించిన గంగుల కమలాకర్ అసలు పార్టీలోకి వచ్చింది ఎప్పుడు? ఆయన ఎన్నికల ముందు గాలి తెరాస వైపు ఉందని గమనించి పార్టీలోకి చేరారు. ఆయన ఇప్పుడు వచ్చి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈటల ను విమర్శిస్తున్నారు.