ఒంటరిగా ప్రయాణించాల్సి వచ్చిన వేళ, పోలీసులకు అనుమానం రాకుండా గ్యాంగ్ స్టర్ నయీమ్ ఆడవేషంలో సంచరిస్తూ ఉండేవాడన్న కథనాలకు బలం చేకూరుస్తూ, పోలీసులకు నయీమ్ ఆడ వేషం వేయించుకుని తీయించుకున్న ఫోటోలు దొరికాయి. చక్కగా నీలిరంగు లంగా, జాకెట్ ధరించి, చున్నీని చేతులకు చుట్టుకుని, మెడలో బంగారు గొలుసులు, పాపటి బిళ్ల, తలలో కనకాంబరాలు పెట్టుకుని తీయించుకున్న ఫోటో సిట్ సోదాల్లో బయటపడింది.
నయీమ్ ఇంట్లో విగ్గులు, ఖరీదైన మేకప్ కిట్ లు, పలు రకాల మహిళల దుస్తులు లభించిన సంగతి తెలిసిందే. అమ్మాయిలను, మహిళలనూ వెంటబెట్టుకుని వాహనాల్లో వెళుతుంటే, పెద్దగా అనుమానించరని, సోదాల సమయంలోనూ వెనుకంజ వేస్తారని నయీమ్ గట్టిగా నమ్మేవాడని పోలీసు వర్గాలు తెలిపాయి. అల్కాపురిలో నయీమ్ ఉంటున్న ఇంట్లో హత్యలు కూడా జరిగాయన్న విషయాన్ని… అరెస్ట్ చేసిన ఫర్హానా, అఫ్సాల నుంచి తెలుసుకున్నామని, సంబంధిత వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉంటే, నయీమ్ ఆడ వేషంలో ఉన్న ‘జంబలకిడి పంబ’ ఫోటోను చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఒక గ్యాంగ్ స్టర్ ఇలా కూడా దందాలు చేస్తారా అంటూ అవాక్కవుతున్నారు. మొత్తానికి నయీమ్ హతమైన తర్వాత, ఆయన గురించి ఆసక్తికర విషయాలన్నీ వెలుగు చూస్తున్నాయి.