Galla Jayadev says Baahubali collection more than Budget fundsగత నాలుగు సంవత్సరాలుగా కష్టాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకున్న విధానంపై విమర్శకులు పంజా విసురుతున్నారు. ఆ మాటకొస్తే ఒక్క విమర్శకులే కాదు… సామాన్య ప్రజలు కూడా సోషల్ మీడియా వేదికగా సెటైర్లతో విరుచుకుపడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే…. గతేడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించిన ‘బాహుబలి’ సినిమా కలెక్షన్స్ కంటే ఏపీ నిధులు తక్కువగా ఉన్నాయని పోస్ట్ ల వరద వెల్లువెత్తుతోంది.

ఈ మాటలు ఒక్క సోషల్ మీడియాకే పరిమితం కాలేదు. సాక్షాత్తు దేశ పార్లమెంట్ లో కూడా వినపడ్డాయి. గుంటూరు టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడిన వేళ… ఏపీకి కేటాయించిన నిధులు ‘బాహుబలి’ కలెక్షన్స్ కంటే తక్కువగా ఉన్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే అది వ్యంగ్యం కాదు… నిజంగా నిజమే..! తాజా బడ్జెట్ లో ఏపీకి నిధులు కేటాయించడంలో కేంద్రం చూపుతున్న తీరుతెన్నులతో, మరోసారి ఏపీ అంశం జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది.

ఎన్నికలు ఉన్న రాష్ట్రాలలో మాత్రమే కేంద్రం నిధులు వెచ్చించడానికి ఉత్సాహం చూపుతుందన్న విషయం ఈ బడ్జెట్ తో మరోసారి తేటతెల్లమైంది. కర్ణాటకలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో, బెంగుళూరు మెట్రోకు నిధులు కేటాయించిందని స్వయంగా ఎంపీ వ్యాఖ్యానించారంటే కేంద్రం ఆలోచనలు ఏ తరహాలో ఆలోచనలు చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. కాంగ్రెస్ మాదిరి కేవలం పొలిటికల్ లబ్ది కోసమే చూస్తోందని పరోక్షంగా చెప్పకనే చెప్పారు.

చూడబోతుంటే… రాబోయే ఎన్నికలలో బిజెపి – టిడిపిల కలయిక ఉండబోదన్న సంకేతాలు కనపడుతున్నాయి. ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేయడానికి టిడిపి సిద్ధంగా లేకపోయినా, ఈ కలహాల కాపురం మరెన్నో నాళ్ళు సాగదన్న విషయం స్పష్టం. మరో పక్కన సోము వీర్రాజు వంటి ఏపీ బిజెపి నేతలు టిడిపిపై ఫైర్ అవుతూ చేస్తున్న వ్యాఖ్యలు శృతిమించుతున్నాయి. దీంతో అతి త్వరలోనే “విడాకుల” ముహూర్తం ఉండొచ్చనేది పొలిటికల్ టాక్.