Gali Janardhana Reddy Daughter marriageవినుడు వినుడు రామాయణ గాధ… వినుడి మనసారా… అని ‘లవకుశ’ సినిమాలో శ్రీరాముడు గురించి అలా ఆలపిస్తుంటే… వినేకొద్ది వినాలనిపిస్తుంది. బహుశా ఈ విధంగానే తన చరిత్రను కూడా చెప్పుకోవాలని అనుకుంటున్నారో ఏమో గానీ, గాలి జనార్ధన్ రెడ్డి ఇంట పెళ్లి గురించి దేశంలోని మీడియా వర్గాలన్నీ మోత మోగిస్తున్నాయి. ఇప్పటికే వెడ్డింగ్ కార్డ్ రూపంలో సంచలనం సృష్టించిన గాలి పెళ్లి కబురు, తాజాగా ఆ పెళ్ళికి వండి వార్చి పెట్టబోయే వంటకాల గురించి హాట్ హాట్ గా వినపడుతోంది.

అవును… ఎంత వేడిగా అంటే… ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఉండే స్పెషల్ వంటకాలతో కలిపి ఏకంగా 1000 రకాల భోజనాలను విందుగా ఏర్పాటు చేయబోతున్నారట. ఒక్కసారి ఊహించుకోవడానికే కష్టసాధ్యంగా ఉన్న ఈ మెనూ గురించి నిజంగా చెప్పాలంటే… “బ్రహ్మోత్సవం” సినిమాలో సమంత, ఇటీవల మహేష్ గారాలపట్టి సితార చెప్పిన ఓ డైలాగ్ గుర్తుకు రాక మానదు. అదేనండి…

వెయ్యి రకాల భోజనాలా… తింటే కడుపు పట్టనంతా… చూస్తే కళ్ళు తిరిగేటంతా…! ఈ భోజనాల కోసం ఏకంగా 100 కోట్లు పైనే ఖర్చు చేయబోతున్నట్లుగా మీడియా వర్గాలు కధనాలు ప్రసారం చేస్తున్నాయి. ఈ పెళ్ళికి అయ్యే ఖర్చుకు సంబంధించిన ఏ సమాచారము అధికారికంగా వెల్లడి కావట్లేదు గానీ, ఇదంతా కూడా ఒక మిడిల్ క్లాస్ మ్యారేజ్ వేడుక అని గాలి సన్నిహితుడు శ్రీరాములు చెప్పడం… అసలైన విడ్డూరం..! ఈ నెల 16వ తేదీన జరగబోయే వేడుకలో ఇంకెన్ని సంచలనాలు నమోదవుతాయో చూడాలి.