Gali-Janardhan-Reddy to quit politicsకర్ణాటక మాజీ మంత్రి, అక్రమ గనుల కేసులో జైలు పాలై ఏడాది క్రితం బయటకు వచ్చిన ‘బళ్ళారి బాబు’ గాలి జనార్దనరెడ్డి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. ప్రత్యక్ష రాజకీయాల నుంచి త్వరలోనే తప్పుకోవాలని గాలి డిసైడ్ అయినట్లుగా పొలిటికల్ వర్గాల టాక్. ఈ విషయాన్ని తన సన్నిహితుల వద్ద గాలి స్వయంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. మరో సంవత్సరంలో కర్ణాటకలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో జనార్దనరెడ్డి బరిలోకి దిగుతారని అందరూ భావించారు.

బళ్లారి, సింధనూరులో ఏదో ఒక నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇంతలోనే గాలి ఈ నిర్ణయం దిశగా అడుగులు వేస్తుండడం కార్యకర్తలను నిరుత్సాహానికి గురిచేసింది. అయితే జనార్దనరెడ్డి తప్పుకునేది ప్రత్యక్ష రాజకీయాల నుంచి మాత్రమేనని, తెర వెనుక మాత్రం రాజకీయాలు కొనసాగుతాయని సన్నిహితులు చెబుతున్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండి కూడా తనపై వరుసగా కేసులు నమోదు అవుతుండడంతోనే గాలి ఈ దిశగా అడుగులు వేసినట్లుగా చెప్తున్నారు.

ఇటీవల జరిపించిన కుమార్తె పెళ్లితో పలు సమస్యలు ఎదురయ్యాయని, అలాగే అంతకుముందు చాలా కేసులు కోర్టులో పెండింగ్ లో ఉన్నందున, ఎన్నికల్లో పోటీ చేసి మరిన్ని కొత్త సమస్యలను కొని తెచ్చుకోవడం ఇష్టం లేకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. రాజకీయాల్లోకి వచ్చి మంత్రి పదవి కూడా అనుభవించానని, ఇక కొత్తగా సాధించేది ఏమీ లేదని, అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని ‘గాలి’ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.