gali-janardhan-reddy-daughter-wedding-cardఆనాటి “మాయాబజార్” సినిమా గుర్తుందా..! లేకుండా ఎందుకుంటుందిలేండి..! ఎస్వీ రంగారావు, ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి వంటి హేమాహేమీలు నటించిన ఈ సినిమాలో ‘శశిరేఖ పెట్టె ఓపెన్ చేయగానే అభిమన్యుడు దర్శనమిచ్చే’ సన్నివేశం అప్పట్లో సంచలనం అయ్యింది. ఎలాంటి గ్రాఫిక్స్ లేని ఆ రోజుల్లో అలాంటి సన్నివేశం చూసి అంతా నోరెళ్ళబెట్టారు. నిజానికి ఇప్పటికీ ఆ సన్నివేశం పెద్ద మిస్టరీయే అనుకోండి! కానీ, ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిన పిదప, దానిని వినియోగించుకుని, అచ్చం ‘మాయాబజార్’ మాదిరే, గాలి జనార్ధన్ ఇంట వెడ్డింగ్ వీడియో సందడి చేస్తోంది.

గాలి జనార్ధన్ రెడ్డి కూతురి వివాహం అత్యంత వైభవంగా జరగనున్న విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుకకు తయారైన శుభలేఖయే ఈ గాలి గారి ‘మాయాబజార్’ మరి. ఓ పెట్టె మాదిరి రూపుదిద్దుకున్న ఈ శుభలేఖ ఓపెన్ చేయగానే, ఓ ఎల్సీడీ స్క్రీన్ దర్శనమిచ్చి, అందులో ఒక నిముషం పాటు ‘గాలి ఫ్యామిలీ అండ్ కో’ వీడియో ప్లే అవుతుంది. ఆ వీడియోలో గాలి కుటుంబ సభ్యులంతా తమ ఇంట వివాహ మహోత్సవానికి ఆహ్వానం పలుకుతున్నారు.

ఈ వీడియోతో పాటు సహజంగా ఉండే అక్షరపు ఆహ్వానం కూడా ఉందనుకోండి. నవంబర్ 16వ తేదీన రాజీవ్ రెడ్డితో జరగబోయే ఈ వేడుక కోసం కొన్ని వందల కోట్లను గాలి మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేస్తున్నారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దానికి ఉదాహరణే ఈ శుభలేఖ. ఈ ఒక్కో లేఖకు అయిన ఖర్చు దాదాపుగా 6 వేల రూపాయలుగా తెలుస్తోంది. దేశంలోని ప్రముఖ సెలబ్రిటీలంతా గాలి ఇంట సందడి చేయనున్నారన్న టాక్ కూడా ఉంది.