gali-janardhan-reddy-cbi-cases-progress-daughter-grand-weddingఅక్రమాస్తుల కేసులో ఓ పక్కన జైలు శిక్ష పడినా గానీ, మరో పక్కన జడ్జిని కొనేందుకు కొన్ని కోట్ల రూపాయలను లంచంగా ఇచ్చిన ఘనుడు ‘బళ్ళారి బాబు’ గాలి జనార్ధన్ రెడ్డిది. ఇటీవలే తన కూతురి వివాహ మహోత్సవం సందర్భంగా మరోసారి దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ కంట్రీగా మారిన గాలి, ఇదే ఉదంతంతో మరోసారి వెలుగులోకి వచ్చాడు. పెద్ద నోట్ల రద్దయిన నేపధ్యంలో అంత ఘనంగా గాలి వివాహం ఎలా జరిపించగలిగారు? అనేది సామాన్య ప్రజలకు దొరకని మిలియన్ డాలర్ల ప్రశ్న.

ప్రస్తుతం దానికే సమాధానం లభించింది. దాదాపుగా 100 కోట్ల రూపాయల బ్లాక్ మనీని 20 శాతం కమీషన్ తో వైట్ గా మార్చారని ఖరారు కావడంతో… మరో కేసు గాలి మెడకు చుట్టుకోబోతోందన్న సంకేతాలు స్పష్టమయ్యాయి. నిజానికి ఈ వివాహ వేడుక జరిగిన వెంటనే ఐటీ శాఖ అధికారులు గాలి జ‌నార్ద‌న్‌కు చెందిన ఆఫీసుల‌పై దాడులు జ‌రిపారు. అలాగే గాలికి నోటీసులు కూడా ఇచ్చి, విచారణకు హాజరయ్యేలా చేసారు. అయితే తాజాగా గాలి డ్రైవర్ ఆత్మహత్య ఉదంతంతో మొత్తం వెలుగులోకి వచ్చింది.

ఓ రెవిన్యూ అధికారి సహాయంతో దాదాపుగా 100 కోట్ల రూపాయలను 20 శాతం కమీషన్ తో మార్చారని, అయితే ఆ లెక్కల్లో తక్కువ వచ్చిందని తేలడంతో, అందులో తానూ భాగస్వామి అయినందున తన చంపేస్తామని గాలి అనుచరులు బెదిరిస్తున్నారని… ఓ లేఖ రాస్తూ ఆత్యహత్య చేసుకోవడంతో ఈ మొత్తం స్కాంకు సంబంధించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బలమైన సాక్ష్యాలు లభించడంతో తన కూతురి పెళ్లి గాలి మెడకు చుట్టుకుందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ‘బళ్ళారి బాబు’ గారు ప్రపంచంలో చేయనిదంటూ ఏమీ లేదా… అని నోరెళ్ళపెట్టడం ప్రజల వంతవుతోంది.