gadikota-srikanth-reddy-vs-pawan-kalyan-jana-senaజనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార పార్టీ మీద విమర్శలు గట్టిగా చెయ్యడంతో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా రెండున్నర ఏళ్ళ కో సారి కేబినెట్ విస్తరణ చేస్తా అని జగన్ ప్రకటించిన మీదట అధినేతను ప్రసన్నం చేసుకోడానికి ఆ పార్టీ నేతలు పోటీ పడి ప్రత్యర్థి నేతల పై తిట్ల దండకం మొదలు పెడుతున్నారు. అయితే ఈ క్రమంలో మరీ విచక్షణ కోల్పోతున్నారు.

ఆంద్రజ్యోతి మీడియా ఎమ్.డి. వేమూరి రాధాకృష్ణ, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పాలేరుల్లా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు వందల హామీలు ఇచ్చి ఒక్కటీ నెరవేర్చకపోయినా పవన్‌ కళ్యాణ్ నోరెత్తకపోవడం ఆయన పాలేరుతనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆరు నెలల్లోనే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తుండడంతో జీర్ణించుకోలేని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, ఆయన తొత్తులైన పవన్‌ కళ్యాణ్, వేమూరి రాధాకృష్ణ ప్రభుత్వంపై బురద చల్లే పనిలో పడ్డారని ఆరోపించారు. నాయకుడంటే ప్రజల పక్షాన మాట్లాడాలని, పవన్, రాధాకృష్ణ ఇద్దరూ చంద్రబాబు నాయుడుని కాపాడేందుకు కష్టపడుతున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పవన్‌ ను ప్రజలు ఛీ కొట్టినా సిగ్గురాకపోవడం దురదృష్టకరమన్నారు. రాజకీయాలలో విమర్శలు మాములే అయితే చేసే విమర్శలలో కొంత విచక్షణ సభ్యత ఉండాలి కదా? వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి జగన్ మాతృమూర్తి, వైఎస్ విజయమ్మ 2014 ఎన్నికలలో ఒడిపోలేదా? ఓడిపోవడం సహజం అన్నప్పుడు సిగ్గుపడటం, ఛీ కొట్టడం వంటి పదాల వాడకం ఎంత వరకు సమంజసం అని జనసైనికులు విమర్శిస్తున్నారు.