Gadikota Srikanth Reddyవైసీపీ ప్రభుత్వం, పార్టీలో ‘ఆల్ ఈజ్ వెల్…175 సీట్లు మాకే…’ అంటూ అందరూ గట్టిగా కోరస్ పాడుతున్నారు. చాలా సంతోషం! దేశంలో మరే పార్టీకి, ప్రభుత్వానికి దక్కని ఇంత ప్రజాధారణ వాటిని నడుపుతున్న అధినేత జగన్మోహన్ రెడ్డికి దక్కడం చాలా గొప్ప విషయమే. అయితే వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నప్పటికీ వైసీపీలో అందరూ ఇలా కోరస్ పాడుకోవడమే విశేషం.

ఇప్పటికే పలు ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని వారి నియోజకవర్గాలలో అదనపు ఇన్‌చార్జిలను నియమిస్తున్నారు. గడప గడపకి కార్యక్రమంతో ప్రజలకు దగ్గరవ్వాలనుకొంటే వైసీపీ ప్రభుత్వం అభాసుపాలవుతుండటంతో జిల్లా కలెక్టర్లను, అధికారులను కూడా దానిలో భాగస్వామూగా చేస్తున్నారు. త్వరలో మంత్రులు, ఎమ్మెల్యేల వెనుక ఐప్యాక్ ప్రతినిధులు కూడా గడప గడపకి కార్యక్రమంలో పాల్గొంటారని తాజా సమాచారం.

ఇంతకాలం ప్రభుత్వ చీఫ్ విప్‌గా వ్యవహరించిన వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పదవిని సిఎం జగన్మోహన్ రెడ్డి కుదించి ప్రభుత్వ విప్‌గా మార్చారు. ఆ పదవిని ముదునూరి ప్రసాదరాజుకు కట్టబెట్టారు. అసలు మంత్రిపదవి లభిస్తుందనుకొన్న గడికోట శ్రీకాంత్ రెడ్డికి రెండోసారి విస్తరణలో కూడా పదవి లభించకపోగా ఉన్న పదవికి కత్తెరవేశారు. అంటే ఆయన పనితీరు పట్ల సిఎం జగన్మోహన్ రెడ్డి సంతృప్తిగా లేరని స్పష్టం అవుతోంది. ఇటీవల తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికలలో పోటీ చేయలేమని తమ వారసులకు అవకాశం ఇవ్వాలని కోరగా సిఎం జగన్మోహన్ రెడ్డి నిరాకరించారు. పార్టీలో ఇటువంటి పరిస్థితులు నెలకొని ఉండగా ‘ఆల్ ఈజ్ వెల్…175 సీట్లు మాకే…’ అని ఆత్మవంచన చేసుకొంటూ పాడుకోవడం వలన ఎవరికి నష్టం?