G.-Kishan-Reddy---BJP-Union-Ministerరెండు తెలుగు రాష్ట్రాల నుండి ప్రధాని నరేంద్ర మోడీ టీం లో చోటు సంపాదించుకున్న ఒకే ఒక్కడు బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎంపీ గంగవరం కిషన్ రెడ్డి. మోడీ క్యాబినెట్ లో కేంద్ర మంత్రిగా రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. అయితే కిషన్ రెడ్డి తెలుగులో కాకుండా హిందీ లో ప్రమాణం చెయ్యడం విశేషం. అయితే ఒకానొక సందర్భంలో ఆయన తడబడ్డారు. అయినా ముందుకు సాగిపోతుంటే రాష్ట్రపతి కలగజేసుకుని సవరించారు. తెలుగులో ప్రమాణం చెయ్యకపోయినా తలపాగా చుట్టి తెలుగుదనం ప్రతిబింభించేలా చేసారు.

మరోవైపు కిషన్‌ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో రాష్ర్ట పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాం నెలకొంది. కిషన్‌ రెడ్డికి ఏ శాఖ అప్పగిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. సామాన్య కార్యకర్తగా పార్టీలో చేరిన కిషన్‌రెడ్డి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగారు. 004లో హిమాయత్‌నగర్‌ శాసనసభ స్థానం నుంచి తొలిసారిగా పోటీ చేసి గెలుపొందారు. నియోజకవర్గాల పునర్‌విభజనలో భాగంగా హిమాయత్‌నగర్‌ అసెంబ్లీ స్థానం అంబర్‌పేటలోకి వచ్చింది. 2009, 2014లో అంబర్‌పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.

2004, 2009, 2014లో వరుసగా గెలుపొంది హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. అయితే 2018 డిసెంబర్ లో జరిగిన ఎన్నికలలో అనూహ్యంగా స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే ఆ ఓటమే ఆయన పాలిట వరం అయ్యింది. నాలుగు మాసాల అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కిషన్‌ రెడ్డి సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి అధికార తెరాస అభ్యర్థిపై 62,144 ఓట్ల మోజార్టీతో విజయం సాధించారు. నేడు కొలువుదీరనున్న కేంద్రమంత్రి వర్గంలో కిషన్‌రెడ్డి స్థానం సంపాదించుకున్నారు.