Friday Fever to YS Jaganఎప్పుడు, ఎలా ఉన్నా… శుక్రవారం వచ్చేపాటికి స్కూల్ కు వెళ్ళే పిల్లాడు మాదిరి కోర్టుకు హాజరయ్యే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘ఫ్రైడే’ ఫీవర్ పట్టినట్లుంది. తాను వెళ్తున్నానన్న సంగతి పక్కన పెడితే, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా ఈ ఫ్రైడేను అనుసంధానం చేయడం… జగన్ లో ఈ ‘ఫ్రైడే’ ఎలా నాటుకుపోయిందో అర్ధం చేసుకోవచ్చు.

అవినీతి కేసులలో భాగంగా ప్రతి శుక్రవారం జగన్ కోర్టుకు వెళ్తే… అభివృద్ధిలో భాగంగా ప్రతి సోమవారం చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించి అధికారులతో చర్చలు జరుపుతుంటారన్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై విమర్శించాలని భావించిన జగన్, “పోలవరం కమీషన్ల కోసమే బాబు ప్రతి శుక్రవారం అక్కడికి వెళ్తున్నారు” అంటూ విమర్శలు చేసారు.

విమర్శలలో నిజం ఉందో లేదో పక్కన పెడితే, అసలు ఆ విమర్శకంటూ ఒక అర్ధం ఉండాలంటే సరైన విధంగా స్పందించాలి కదా! ప్రతి అంశంలోనూ ఏదొక విధంగా ఆరోపణలు చేయడమే పనిగా పట్టుకున్నట్లు ఈ సందర్భంగా మరోసారి స్పష్టమవుతోంది. అందుకే సోమవారం వెళ్తారో, శుక్రవారం వెళ్తారో కూడా తెలియనంతగా జగన్ స్పందిస్తున్నారు.

బహుశా జగన్ లో ఉన్న అసహనం పతాక స్థాయికి చేరుకున్నట్లుగా కనపడుతోంది. ఓ పక్కన పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలతో సెల్ఫ్ గోల్ వేసుకున్నారని రాజకీయ విశ్లేషకులంతా అభిప్రాయ పడుతుండగా, మరోవైపు చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలతో… తన మాటలకు, విమర్శలకు విలువ లేకుండా చేసుకుంటున్నారన్న వాదనకు రోజురోజుకు బలం తోడవుతోంది.