Free Internet in INDIAదేశవ్యాప్తంగా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చినా.. ధరలు మాత్రం ఇంకా సామాన్య వినియోగదారులకు అందనంత ఎత్తులోనే ఉన్నాయి. దీంతో పేదలు ఇంటర్నెట్ కు దూరంగానే ఉంటున్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకు దేశవ్యాప్తంగా ఉచితంగా ఇంటర్నెట్ అందించాలని టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆలోచనలు చేస్తోంది. గురువారం విడుదల చేసిన ఒక స్టేట్ మెంట్ లో దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నట్లు ట్రాయ్ పేర్కొంది.

సర్వీస్ ప్రొవైడర్ తో సంబంధం లేకుండా అందరికీ ఉచితంగా ఇంటర్నెట్ డేటాను కేటాయించడం లేదా వినియోగించిన డాటాను రీయింబర్స్ చేసే పథకాలను పరిశీలిస్తోంది. ఇందుకోసం ఒక ప్రత్యేకమైన ప్లాట్ ఫాంను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఇంతకుముందు ఫేస్ బుక్ సంస్థ తెరపైకి తెచ్చి, ట్రాయ్ నుంచి తిరస్కారం ఎదుర్కున్న ‘ఫ్రీబేసిక్స్’ తరహాలో కాకుండా… ఉచితంగా వచ్చే డేటాను ఇంటర్నెట్లో ఏ వెబ్ సైట్ ను చూడడానికి గానీ, ఏ సమాచారాన్నైనా పొందడానికి గానీ వినియోగించుకోవచ్చు.

‘ఫ్రీ-బేసిక్స్’ను తిరస్కరించిన తర్వాత పలు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు తమ సమస్యలను ట్రాయ్ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో… తాజా స్టేట్ మెంట్లో ట్రాయ్ పలు సూచనలు చేసింది. ‘అండర్ కనెక్టెడ్,’ ‘అన్ కనెక్టెడ్’ జనాభా ప్రాంతాల కింద విభజించి వీటిలో ఏ మోడల్ ను తీసుకోవాలో జూన్ 16వ తేదీలోగా సూచించాలని కోరింది. ట్రాయ్ తాజా నిర్ణయంపై నెట్ న్యూట్రాలిటీ మద్దతు దారులు, ఇంటర్నెట్ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ట్రాయ్ తాజా పత్రంలో సూచించిన అంశాలపై విమర్శలూ వస్తున్నాయి. ‘ఫ్రీబేసిక్స్’ తరహాలో ప్రత్యేక ప్లాట్ ఫాం ఏర్పాటును తప్పుపడుతున్నారు. వెబ్ సైట్లలో వినియోగించిన డేటాపై నిఘా ఉంచి డేటాను రీయింబర్స్ చేయడం నెట్ న్యూట్రాలిటీకి విఘాతకరమని పేర్కొంటున్నారు.