Foundation Stone Laid for TS New Secretariat, Harish Rao Attendsతెలంగాణ నూతన సచివాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ప్రస్తుత సచివాలయం డి-బ్లాక్‌ వెనుకభాగంలోని తోటలో కేసీఆర్ భూమి పూజ చేశారు. సచివాలయం ప్రస్తుతం 25 ఎకరాల్లో ఉండగా దాన్ని 30 ఎకరాల మేరకు విస్తరించనున్నారు. వాస్తు దోషం లేకుండా అన్ని హంగులతో రూ.400 కోట్ల వ్యయంతో సచివాలయ భవన నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మధ్య జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి గైర్హాజరయ్యి సంచలనం సృష్టించిన హరీష్ రావు సచివాలయం శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు.

ఆ తరువాత కేసీఆర్ ఎర్రమంజిల్‌లోని రోడ్లు భవనాల శాఖ ఆవరణలో శాసనసభ నిర్మాణానికి సీఎం భూమిపూజ చేశారు. చరిత్రాత్మక ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ను కూల్చి కొత్త అసెంబ్లీ భవన సముదాయం, సచివాలయం ప్రాంగణంలోని భవనాలన్నింటినీ కూల్చి అక్కడే కొత్త సచివాలయ భవనం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. నిజాం వారసులు ఇప్పటికే దీనిని వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే అయినా ప్రభుత్వం ముందే వెళ్ళింది.

కొత్త అసెంబ్లీ భవన సముదయానికి 100 కోట్లు ఖర్చు అవుతుందని తెలుస్తుంది. కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణంపై అధ్యయనం కోసం మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి నేతృత్వంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, వి.శ్రీనివాస్‌ గౌడ్‌తో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం గురువారం సమావేశమై చర్చించనుందని అధికారవర్గాలు తెలిపాయి. చెన్నైకు చెందిన ఆస్కర్ పొన్నీ లేదా ముంబైకి చెందిన హఫీజ్ కాంట్రాక్టర్ ఇచ్చిన డిజైన్లలో ఒకటి ముఖ్యమంత్రి ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.