Formula e racing hyderabadహైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక ఈవెంట్ కు వేదిక కాబోతోంది. 2014లో ప్రారంభించిన ‘ఫార్ములా ఈ’ కార్ల రేసింగ్ కు ఈ ఏడాదికి గానూ హైదరాబాద్ ఆతిధ్యం ఇవ్వబోతోంది. ఇంతకుముందు న్యూయార్క్, లండన్, బెర్లిన్, రోమ్ మరియు సియోల్ లలో జరిగిన ఈ ఎలక్ట్రానిక్ కార్ల రేసింగ్ ఈ ఏడాది హైదరాబాద్ లో జరుగుతుండడం తెలుగు వారికి గర్వ కారణం.

దీనికి సంబంధించి ఫార్ములా ఈ అసోసియేషన్, గ్రీన్ కో (ఎనర్జీ ప్రొవైడర్) మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ట్రై పార్టీ ఒప్పందం కుదిరింది. ఇండియాలో న్యూఢిల్లీ, ముంబై, బెంగుళూరు మరియు హైదరాబాద్ ప్రాంతాలను పరిశీలించిన మీదట, చివరగా హైదరాబాద్ ను ఫార్ములా ఈ ప్రతినిధులు ఎంపిక చేసారు. ఎఫ్1 రేస్ మాదిరి ఈ ‘ఫార్ములా ఈ’ కోసం ప్రత్యేకంగా ట్రాక్ నిర్మించాల్సిన అవసరం లేదు.

ఇలా తెలంగాణ రాజధాని హైదరాబాద్ గురించి రోజుకొక వార్త వెలుగు చూస్తుంటే, రాజధాని అంటూ లేని ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటి? అన్న కోణంలో తెలుగు ప్రజలు పోలుస్తున్నారు. అయితే ఏపీలో రోడ్లే లేక ఇబ్బంది పడుతుంటే, ఇంకా కార్ల రేసింగ్ సంగతి దేవుడెరుగు? అనుకోవడం ప్రజల వంతవుతోంది. ఏపీలో ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం… సమస్త రోడ్లన్నీ గుంతల మయమే..!

గతంలో జనసేన ఇచ్చిన పిలుపుతో రాష్ట్రంలోని కొన్ని గుంతలకు జనసైనికుల ద్వారా మోక్షం లభించింది. అలాగే ఇటీవల టీడీపీ కార్యకర్తలు కూడా ఈ గుంతలను పూడ్చే కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. గుంతలు ఉన్న చోట ‘జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త’ అంటూ హోర్డింగ్స్ పెట్టి గోదావరి జిల్లాల వాళ్ళు నిరసన తెలియజేసినప్పటికీ, ప్రభుత్వం మాత్రం గుంతలు పూడ్చడానికి కంకణం కట్టుకోకపోవడం విస్తుపోయే విషయం.

ఏపీలో పరిస్థితి ఇలా గుంతలమయం కావడంతో, ఇంకా కార్ల రేసింగ్ ల మాట ఎక్కడ నుండి వస్తుందిలే? అయితే ఊహాజనితమే అయినా, ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు అందరి కంటే ముందువరుసలో ఉంటారు. బహుశా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో, ప్రత్యక్షంగా కార్ల రేసింగ్ లను వీక్షించే అవకాశం ఏపీ వాసులకు దక్కేదేమో అనుకుని సంతృప్తి చెందడం ఒక్కటే మిగిలింది.