Former janasena leaders to join kcr brs party in APతెలంగాణ సిఎం కేసీఆర్‌ తన టిఆర్ఎస్‌ పార్టీని బిఆర్ఎస్‌ పార్టీగా మార్చగానే, ఇక్కడ ఏపీలో పలు నగరాలలో ఆయనకి అభినందనలు తెలుపుతూ ఫ్లెక్సీ బ్యానర్లు వెలిశాయి. కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌ నాయకులని, ప్రజలని ఎంతగానో ఈసడించుకొని రాష్ట్రాన్ని ఈ దుస్థితికి తెచ్చినప్పటికీ ఏపీకి చెందిన కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఆ పార్టీలో చేరి, ఏపీలో బిఆర్ఎస్‌ని విస్తరిస్తామని చెపుతూ కేసీఆర్‌ ఇంటి గుమ్మం ముందు పడిగాపులు కాస్తూ ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం ఆయన కాళ్ళ ముందు పెడుతున్నారు.

మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్ధసారధి ఈరోజు హైదరాబాద్‌లో కేసీఆర్‌ సమక్షంలో బిఆర్ఎస్‌ పార్టీలో చేరబోతున్నారు. వారిలో తోట చంద్రశేఖర్‌ని ఏపీ బిఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా నియమించబోతున్నట్లు సమాచారం. వీరితో పాటు ఉభయ గోదావరి జిల్లాలకి చెందిన పలువురు రాజకీయ నిరుద్యోగులు బిఆర్ఎస్‌ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం.

వీరిలో రావెల కిశోర్ బాబు గత టిడిపి ప్రభుత్వం హయాంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా చేశారు. 2019 ఎన్నికలకు ముందు జనసేనలో చేరి పత్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బిజెపిలో చేరి బయటకి వచ్చేశారు. ఇప్పుడు బిఆర్ఎస్‌లో చేరబోతున్నారు.

తోట చంద్రశేఖర్ మొదట ప్రజారాజ్యంలో తర్వాత జనసేన పార్టీలలో చేరి 2014, 2019 ఎన్నికలలో అదృష్టం పరీక్షించుకొన్నారు కానీ రెండుసార్లు ఓడిపోవడంతో ఇప్పుడు బిఆర్ఎస్‌లో చేరి మరోసారి అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. అలాగే చింతల పార్ధసారధి, 2019లో జనసేన తరపున అనకాపల్లి నుంచి లోక్‌సభకి పోటీ చేసి ఓడిపోయారు.

తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్‌తో రాజకీయాలు చేస్తున్న కేసీఆర్‌, ఏపీలో కులరాజకీయాలే నడుస్తాయని గ్రహించి ఆ లెక్కనే కులాలవారీగా రాజకీయ నిరుద్యోగులను గుర్తించి వారితో ఏపీలో బిఆర్ఎస్‌ పార్టీని విస్తరించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. నేటికీ ఆంధ్రప్రదేశ్‌తో సాగునీరు, ఆస్తుల పంపకాలు, బకాయిల విషయంలో పేచీలు పెడుతున్న కేసీఆర్‌, ఏపీలో తన పార్టీని విస్తరించాలనుకోవడం విశేషమైతే, ఆయన ప్రాపకం కోసం ఏపీ రాజకీయ నిరుద్యోగులు ఆయన ఇంటి ముందు క్యూకడుతుండటం విస్మయం కలిగిస్తుంది. వీరికి ఏపీ రాష్ట్ర ప్రయోజనాలు, ఏపీ ప్రజల ఆత్మగౌరవం కంటే పదవులు, అధికారమే ముఖ్యమా?అనే సందేహం కలుగుతుంది. ఇటువంటి నేతలనీ, వారితో ఏపీలో అడుగుపెట్టబోతున్న బిఆర్ఎస్‌ పార్టీ పట్ల ఏపీ ప్రజలు ఏవిదంగా స్పందిస్తారో?