సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ ఇటీవలే తన పదవికి స్వచ్చంద పదవీ విరమణ చేసి రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషిచేస్తానని ఆయన అంటున్నారు జిల్లాల వారీగా రైతులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేసి ఇతర రాష్ట్రాల్లో సాగు విధానాలపై అవగాహన కల్పిస్తామన్నారు.
ప్రజలు, రైతుల స్థితిగతులను పరిశీలించిన అనంతరం రెండు నెలల్లో తన కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆయన జనసేనలో జాయిన్ కావడం లేదని చెప్పేశారు. ఆయన బీజేపీలో చేరతారని విస్తృతంగా ప్రచారం ఉంది. కొన్ని మీడియా సంస్థలైతే ఏకంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతారని అంటున్నాయి.
ఎపిలో సంచలనం సృష్టించిన వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు, గాలి జనార్దన్‌రెడ్డి మైనింగ్ కేసుల వ్యవహారంతో పాటు సత్యం కంప్యూటర్స్ కేసు అప్పటి సీబీఐ జెడి లక్ష్మీనారాయణ అత్యంత కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 1990 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్ ఐపిఎస్ ఆఫీసర్ అయిన లక్ష్మీ నారాయణ 2006 లో డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ సిబిఐ రీజనల్ జాయింట్ డైరెక్టర్ గా నియమించబడ్డారు. ఆ తరువాత తను సొంత క్యాడర్ మహారాష్ట్రకు ట్రాన్స్ ఫర్ అయిన ఆయన ఆ రాష్ట్రానికి అడిషనల్ డీజీగా ఉండగా స్వచ్చంద పదవీ విరమణ చేశారు.