Former-AP-Minister,-TDP-leader-Adinarayana-Reddy-joined-in-BJPమాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆది పార్టీ మారతారని చాలా కాలంగా ప్రచారం జరిగినా అది ఇప్పటికి కుదిరింది. ఈరోజు ఉదయం ఢిల్లీలో ఆదికి కాషాయ కండువా కప్పి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా బీజేపీలోకి ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దేశాభివృద్ధి ప్రాంతీయ పార్టీలతో సాధ్యంకాదన్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే 2014 ఎన్నికలలో ఒక ప్రాంతీయ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్) టిక్కెటు మీద ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తరువాత మరో ప్రాంతీయ పార్టీ (టీడీపీ) లోకి ఫిరాయించి, దాదాపుగా మూడున్నరేళ్లు మంత్రిగా చేసి, తరువాత ఎన్నికలలో తాను, తన పార్టీ ఓడిపోయాకా గానీ ఆదికి జాతీయ పార్టీల గొప్పదనం అర్ధం కాలేదు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చెప్పేదొకటి చేసేదొకటి అని విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధానిగా ఉంటుందో లేదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ‘రివర్స్ టెండరింగ్‌ను అందరూ వ్యతిరేకించినా జగన్ మొండిగా ముందుకెళ్లారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం తప్పనిసరి. బీజేపీ బలోపేతానికి కృషి చేస్తాను’ అని ఆదినారాయణరెడ్డి చెప్పుకొచ్చారు.

నిజంగా ఆది బీజేపీలో స్థిరంగా ఉంటే మంచిదే. 2019 ఎన్నికలలో కడప ఎంపీగా పోటీ చేసిన ఆది నారాయణ రెడ్డి. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి చేతిలో 3,80,976 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి రక్షణ కోసం ఇప్పుడు బీజేపీలో చేరారు.