for Which Party Will BJP gives support in APఏపీలో బిజెపి, జనసేనలు బహిరంగంగా కలిసి పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో బిజెపితో వైసీపీ సఖ్యతగా లేనప్పటికీ సిఎం జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి తదితరులు కేంద్రంతో విధేయంగా ఉంటూ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేసేస్తున్నారు. బిజెపికి టిడిపి చాలా కాలంగా ఫ్రెండ్‌షిప్ సిగ్నల్స్ పంపిస్తోంది. దానంతట అది ముందుకు వస్తే వచ్చే ఎన్నికలలో మళ్ళీ పొత్తులు పెట్టుకోవాలని ఎదురుచూస్తున్నారు.

అంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బిజెపి అధికారంలో లేనప్పటికీ, అధికారంలోకి వచ్చే అవకాశం కూడా లేనప్పటికీ కేంద్రం పట్టు కలిగి ఉందని అర్దమవుతోంది. కనుక వచ్చే ఎన్నికలలో టిడిపి, వైసీపీలలో కేంద్రం (బిజెపి) ఎటువైపు మొగ్గుతుంది?అనే సందేహం కలుగడం సహజం. వచ్చే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్‌ను ఓడించి బిజెపి అధికారంలోకి రావాలనుకొంటోంది. కనుక వచ్చే ఎన్నికలలో అది ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే దాంతో జత కట్టవచ్చు.

ఎందుకంటే వచ్చే ఎన్నికలలో బిజెపి తనంతట తానుగా అధికారంలోకి రాలేదు కనుక గెలుపు గుర్రంపై పందెం కాస్తే ఆనక అధికారంలో భాగం పంచుకొనే అవకాశం లభిస్తుంది. ఒకవేళ అది సాధ్యపడకున్నా వచ్చే ఎన్నికల తర్వాత బిజెపి మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఆ పార్టీ మద్దతు అవసరం పడవచ్చు. ఇదీగాక ఈలోగా ఏపీలోకి కేసీఆర్‌ నేతృత్వంలోని బిఆర్ఎస్‌ ప్రవేశిస్తే మళ్ళీ ఆ లెక్కలు వేరే ఉంటాయి. కనుక ఏపీలో ఈ రెండు పార్టీలలో బిజెపి ఎటువైపు మొగ్గుతుందనే విషయం ఎన్నికలకు ఆరు నెలల ముందు స్పష్టత రావచ్చు. దానితో పొత్తుల కోసం కాకపోయినా ఈ రెండు పార్టీలకు వచ్చే ఎన్నికలలో గెలిచి అధికారం చేజిక్కించుకోవడం చాలా అవసరం కనుక పార్టీలను బలోపేతం చేసుకోక తప్పదు.