why-jayalalithaa-was-buried-not-crematedతమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ‘కాలం’ చేసారన్న సమాచారం ముందుగా ఎవరికి వెళ్తుందనుకుంటున్నారు? శశికళకా? పార్టీ నేతలకా? కేంద్ర ప్రభుత్వనికా? కాదు… వీరెవరికీ కాదు… శవపేటికలు తయారుచేసే వ్యక్తికి. అవును… జయలలిత మరణించారన్న విషయం మీడియాకు చేరకముందే, ‘ఫ్లయ్యింగ్ స్క్వాడ్ అండ్ హోమేజ్ కంపెనీ’ మేనేజింగ్ డైరెక్టర్ పీఆర్ఎంఎం శాంతకుమార్ కు చేరిపోతుంది. ఒక్క జయలలిత విషయంలోనే కాదు, ఎవరైనా విఐపి పరమపదిస్తే… ముందుగా తెలిసేది ఇతనికే!

1994లో ప్రారంభమైన ఈ సంస్థ గత 22 సంవత్సరాలుగా అన్ని రకాల ధరల్లో శవపేటికలు తయారు చేస్తుంటుంది. గతంలో మాజీ ప్రధాని పీవి నరసింహారావు, నటుడు శివాజీ గణేశన్, సీనియర్ నటి మనోరమ వంటి వారెందరికో శవపేటికలు తయారు చేసిచ్చిందీ సంస్థ. జయలలిత మరణవార్త తెలియగానే, ఆమె కోసం హెవీ డ్యూటీ ఫ్రీజర్ బాక్స్ తో కూడిన కఫిన్ తయారు చేసినట్టు శాంతకుమార్ తెలిపారు. రాజాజీ హాల్ లో జయలలిత దేహం అందరికీ కనిపించేలా ఏటవాలుగా ఉండేలా చేసిన ఏర్పాటు ఆలోచన కూడా శాంతకుమార్ దే.

“శవపేటికపై ఏటవాలుగా దేహాన్ని ఉంచితే, జారిపోతుందని కొందరు భయపడ్డారు. కానీ అలా జరుగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. వినూత్న రీతిలో దాన్ని డిజైన్ చేశాము. సాధారణ వాతావరణంలో ఉన్నా రెండు నుంచి మూడు రోజుల పాటు శరీరాన్ని సున్నా నుంచి ఐదు డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలో ఉంచే కఫిన్ అది. పోయిస్ గార్డెన్ నుంచి, రాజాజీ హాల్, ఆపై అక్కడి నుంచి అన్నా సాలైకి జయలలిత మృతదేహం చేరే వరకూ జాగ్రత్తలు తీసుకున్నామని” శాంతకుమార్ వివరించారు. తమ సంస్థ తొలి శవపేటికను మాజీ మంత్రి వీఆర్ నెండు చెళియన్ కు తయారు చేసిందని, ఇప్పటివరకూ 500 మందికి పైగా వీఐపీలకు శవపేటికలు అందించామని తెలిపారు.