AP Global Investors Summit వైసీపీ ప్రభుత్వం చెప్పుకొంటున్న ఏపీకి కాబోయే రాజధాని విశాఖలో శుక్ర, శనివారాలలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సు ద్వారా 2 లక్షల కోట్ల పెట్టుబడులు ఆశిస్తోంది. కనుక ‘అడ్వాంటేజ్ ఏపీ’ పేరుతో నిర్వహిస్తున్న ఈ సదస్సుని విజయవంతం చేయడానికి చాలా భారీగా ఏర్పాట్లు చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన 14 రంగాలలో పెట్టుబడులని ఆకర్షించేందుకు అధికారులు కృషి చేయనున్నారు. రెండు రోజుల సదస్సులో హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిద శాఖల ముఖ్య కార్యదర్శులు అందరూ విశాఖకు తరలివచ్చారు.

ఈ సదస్సు పలువురు కేంద్ర మంత్రులు, దేశవిదేశాల నుంచి పలువురు పారిశ్రామికవేత్తలు, ఐ‌టి కంపెనీల ప్రతినిధులు, వివిద దేశాల ప్రభుత్వాల తరపున అధికార ప్రతినిధులు ఈ సదస్సుకి హాజరవుతున్నారు.

ఈ సదస్సుకి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా, టాటా గ్రూప్ ఛైర్మన్‌ నటరాజన్, సిఐఐ అధ్యక్షుడు సంజీవ్ బజాజ్, జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంధి మల్లిఖార్జునరావు, భారత్‌ బయోటెక్ గ్రూప్ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల, ఎండీ సుచిత్ర, కియా ఇండియా సీఈవో డోంగి లీ, ఒబెరాయ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌ అర్జున్ ఒబెరాయ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ ఛైర్మన్‌ నవీన్ జిందాల్, టెస్లా ఇంక్ సహ వ్యవస్థాపకుడు మార్టిగ్ ఎబర్ హార్ట్, జెఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్, అపోలో హాస్పిటల్స్ వైఎస్ ఛైర్మన్‌ ప్రీతిరెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఇంకా ఆదానీ పోర్ట్స్ సీఈవో కరణ్ ఆదానీ, ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ వైస్ ఛైర్మన్ అండ్ ఎండీ ఎన్‌.శ్రీనివాసన్, దాల్మియా భారత్‌ గ్రూప్ ఎండీ పునీత్ దాల్మియా తదితర పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు.

తొలి రోజున మొదట జ్యోతి ప్రజ్వలన, సాంస్కృతిక కార్యక్రమాలతో అతిధులకు ఆహ్వానాల తర్వాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ, సిఎం జగన్మోహన్ రెడ్డి,ఏపీ సీఎస్ జవహార్ రెడ్డి, ఆ తర్వాత పారిశ్రామికవేత్తల ప్రసంగాలు జరిగాయి.

మధ్యాహ్నం భోజన విరామం తర్వాత 3 గంటల నుంచి మళ్ళీ నాలుగు ఆడిటోరియంలలో ఎగ్జిబిషన్ ఉంటుంది. వేర్వేరు రంగాలలో పెట్టుబడులు ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు ఆడిటోరియంలను ఏర్పాటు చేసింది.

ఐ‌టి, లాజిస్టిక్స్, రెనివబుల్ ఎనర్జీ అండ్ గ్రీన్ హైడ్రోజన్, ఆటోమోటివ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్, హెల్త్ కేర్ అండ్ మెడికల్ ఎక్వీప్మెంట్, ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ బిజినెస్, ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ తదితర రంగాలలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలని తెలియజేస్తూ ప్రదర్శనలు, ఆయా రంగాలలో నిపుణులు, సంబంధిత శాఖల అధికారులు అతిధులకి వివరిస్తారు.

ఈరోజు సాయంత్రం 6 గంటలకు కూచిపూడి నృత్య ప్రదర్శనఆ తర్వాత రాత్రి 8 గంటలకి డ్రోన్ షోతో తొలిరోజు సదస్సు ముగుస్తుంది.