first coronavirus death in andhra pradesh vijayawadaఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి కరోనా మృతి సంభవించింది. విజయవాడలో 55 ఏళ్ల వ్యక్తి మర్చి 30న ఆసుపత్రికి వచ్చిన గంటకే మృతి చెందారు. ఆయన మృతి చెందాకా ఈరోజు వచ్చిన టెస్ట్ రిపోర్టులలో కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయనకు బీపీ, షుగర్, గుండె సమస్యలు కూడా ఉన్నాయని సమాచారం.

మృతుడి కుమారుడు ఇటీవలే ఢిల్లీలో జరిగిన జామాత్ కార్యక్రమంలో పాల్గొని వచ్చాడు. అతని నుండి వైరస్ సంక్రమించి ఉండవచ్చని అంటున్నారు. మృతుడితో కాంటాక్ట్ లో ఉన్న 29 మందిని ఇప్పటికే గుర్తించి వారిని క్వారంటైన్ కి పంపడం జరిగింది. ఇదే ఆంధ్రప్రదేశ్ లో సంభవించిన మొదటి కరోనా మృతి.

ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో 161 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో మెజారిటీ కేసులు ఢిల్లీకి సంబంధించిన జమాత్ కార్యక్రమానికి సంబంధించినవే. ఇప్పటికే ఇద్దరు కోలుకుని డిశ్చార్జ్ కాగా ఈరోజు కాకినాడకు చెందిన ఒక యువకుడు డిశ్చార్జ్ అయ్యాడు.

నిన్నటి వరకూ కృష్ణా జిల్లాలో ఎక్కువ కేసులు నమోదవ్వగా.. తాజాగా నెల్లూరు జిల్లాలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. నెల్లూరు లో ఇప్పటివరకూ 32 కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా ప్రజలు భయంతో వణికిపోతున్నారు. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో తప్ప అన్ని జిల్లాలలోనూ కేసులు నమోదు అయ్యాయి.