Fire accident in pawan kalyan campaignశ్రీకాకుళం పట్టణంలోని ఏడు రోడ్ల కూడలిలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల సభ నిర్వహిస్తుండగా అపశ్రుతి చోటుచేసుకుంది. సభలో మాట్లాడుతుండగా ఆయన వాహనం నుంచి పొగలు వెలువడ్డాయి. వెంటనే అప్రమత్తమైన పవన్‌ వాహనం దిగిపోయారు. ఆయనతో ఉన్న వ్యక్తిగత సిబ్బంది, పార్టీ అభిమానులు మంటలు అదుపు చేశారు. ఒక్కసారిగా అభిమానులు ఆందోళనకు గురయ్యారు. పవన్ కళ్యాణ్ వాహనం నుంచి దిగి తన ప్రచారాన్ని కొనసాగించారు.

ఒక మినీ వ్యాను ను పవన్ కళ్యాణ్ ప్రచార స్టేజి కింద ఉపయోగిస్తున్నారు. వేసవి వేడికి వాహనంలోని పెట్రోల్‌ ట్యాంక్‌లో మంటలు చెలరేగి పొగలు అలముకున్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శ్రీకాకుళం పర్యటన తరువాత పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ లో పశ్చిమ గోదావరికి బయల్దేరతారు. ఆయన జిల్లా నుండి పోటీ చేస్తున్న భీమవరం నియోజకవర్గంలో ఈరోజు ప్రచారం చెయ్యబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలలో రెండు చోట్ల నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నుండి ఆయన పోటీలో ఉన్నారు. భీమవరం ఆయన సొంత జిల్లాలో ఉండడం తన సొంత సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉండటం ఇక్కడ ఆయనకు కలిసొచ్చే విషయం. నిన్న ఆయన గాజువాకలో ప్రచారం చేశారు. గాజువాకలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంలో ఆయన భీమవరం ప్రజలకు ఎటువంటి భరోసా ఇస్తారనేది చూడాలి.