Arun Jaitley, Arun Jaitley Special Status, Arun Jaitley AP Special Status, Finance Minister Arun Jaitley Special Status, Arun Jaitley Andhra Pradesh Special Statusకేంద్రం అనుసరిస్తున్న విధానాలతో ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఒక్కసారిగా తన స్వరం మార్చడంతో కేంద్ర ప్రభుత్వంలో కదలికలు వచ్చినట్లు కనపడుతోంది. ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వలేమని రాజ్యసభ వేదికగా ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యల తర్వాత… చంద్రబాబు అసంతృప్తి వ్యాఖ్యలకు తోడు పార్లమెంటు లోపలా, బయటా టీడీపీ ఎంపీల నిరసనలతో ఉలిక్కిపడింది. కాస్త ఆలస్యంగానైనా ప్రస్తుతం సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనపడుతోంది.

‘ప్రత్యేక హోదా’పై ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో దాని స్థానంలో భారీగా ‘ప్రత్యేక సహాయం’ చేయాలని కేంద్రం తలపిస్తోంది. అయితే ఈ ప్యాకేజీ ఏపీ ప్రజలను సంతోషపెట్టేలా ఉండేలా చూడాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ… కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. మిత్రపక్షం టీడీపీలో వెల్లువెత్తుతున్న నిరసనలపై ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ప్రధానితో భేటీ తర్వాత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వద్దకు వెళ్లిన వెంకయ్య నాయుడు… టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి సుజనా చౌదరిని కూడా వెంట తీసుకెళ్లారు. ప్రత్యేక హోదాను మాత్రమే తమ రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారని, దాని స్థానంలో ఎన్ని కోట్లిచ్చినా వారిని సంతోషపెట్టలేరని సుజనా చౌదరి నేరుగా జైట్లీకి చెప్పినట్లు సమాచారం. అయితే ఏపీ ప్రజలను తమ ప్యాకేజీతో తప్పనిసరిగా సంతోష పెడతామని, అందుకు ఒకటి, రెండు రోజులు మాత్రమే ఆగాలని అరుణ్ జైట్లీ చెప్పడంతో… ఏపీకి ప్రత్యేక సాయంగా క్రింద ప్యాకేజీని ప్రకటించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.