filmmaker Dasari Narayana Rao put on ventilatorటాలీవుడ్ ‘పెద్దన్న,’ చిన్న నిర్మాతల పాలిట దైవం అయిన దాసరి నారాయణరావు కిమ్స్ ఆసుపత్రిలో చేరారన్న వార్త ఒక్కసారిగా కలకలం రేపింది. దీంతో అసలు దాసరికి ఏమైంది? అన్న కోణంలో రకరకాలుగా చర్చలు సాగుతున్న నేపధ్యంలో… ముందుగా కిమ్స్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొల్లినేని భాస్కర్ రావు స్పందిస్తూ… “వెంటిలేటర్ పై దాసరికి చికిత్స అందిస్తున్నారు, అలాగే కిడ్నీలు ఫెయిల్యూర్ అయిన నేపధ్యంలో డయాలసిస్ కూడా చేస్తున్నారు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ను నియంత్రించడానికి ఛాతీ భాగంలో ఆపరేషన్ చేస్తున్నామని, ఆపరేషన్ పూర్తయిన తర్వాత మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని” తెలిపారు.

దీంతో దాసరి ఆరోగ్యంపై ఒక్కసారిగా తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కిమ్స్ ఆసుపత్రి వైద్యులు మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ… “శ్వాసకోస ఇబ్బందులతో రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారని, ఈ సందర్భంగా చేసిన పరీక్షల్లో అన్నవాహికలో రాపిడి ఏర్పడిందని గుర్తించామని, దానికి ట్యూబ్ పెట్టి అన్నవాహిక శుద్ధి చేసి, రాపిడి దగ్గర మెటల్ స్టెంట్ వేశామని” చెప్పారు. ఈ నేపథ్యంలో శరీరం సహకరించక కిడ్నీ ఫెల్యూర్, లంగ్స్ ఫెయిల్యూర్స్ కూడా అయ్యాయని అన్నారు. కిడ్నీలు పని చేసేందుకు డయాలసిస్ సహాయం తీసుకున్నామని, లంగ్స్ ఫెల్యూర్ సరిచేసేందుకు అన్నవాహికలో ఏర్పడిన ఇన్ఫెక్షన్ ను తొలగించామని చెప్పారు.

ప్రస్తుతం దాసరి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రెండు లేదా మూడు రోజులు పూర్తి అబ్జర్వేషన్ లో ఉంచి చికిత్స అందించాలని, అప్పటివరకు ఏదీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. ఇది సున్నితమైన అంశమన్న సంగతి గుర్తించాల్సిందిగా చెప్పారు. అయితే కిడ్నీల పనితీరు విషయంలో చివరి ఆప్షన్ గా డయాలిసిస్ కు వెళ్తారన్న సంగతి తెలిసిందే. డయాలిసిస్ ఒక్కసారి ప్రారంభిస్తే, నిర్ణీత కాలవ్యవధిలో జీవితకాలమంతా చేస్తూనే ఉండాలన్నది సహజంగా కిడ్నీ వైద్య నిపుణులు చెప్పే మాట. మరి దాసరి విషయంలో ఏ మాట చెప్పాలన్నా ఓ రెండు, మూడు రోజులు ఆగమంటున్నారు వైద్యులు.