fidaa-sekhar- kammula‘ఆనంద్’ సినిమాతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన శేఖర్ కమ్ముల, ఆ వెంటనే ‘గోదావరి’ సినిమాతో మెప్పించారు. ఇక 2007లో విడుదలైన శేఖర్ “హ్యాపీ డేస్” టాలీవుడ్ ను షేక్ చేసింది. దీంతో యూత్ లో మంచి క్రేజ్ తో పాటు బాక్సాఫీస్ వద్ద శేఖర్ సినిమాలు ఒక బ్రాండ్ గా మారిపోయాయి. ఊహించని సక్సెస్ ఎదురైనపుడే తప్పటడుగులు పడతాయి అనేది ఇండస్ట్రీ నినాదం. ఇందుకు శేఖర్ కమ్ముల కూడా మినహాయింపు కాదని రుజువైంది.

‘హ్యాపీ డేస్’ వంటి అనూహ్యమైన సక్సెస్ ఊపును కొనసాగించలేక “అవకాయ్ బిర్యానీ”తో చతికిలపడ్డాడు. ఆ తర్వాత రానాతో తీసిన “లీడర్” ప్రేక్షకుల మెప్పు పొందింది గానీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన విధంగా రాణించ లేకపోయింది. దీంతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న తాపత్రయంతో ‘హ్యాపీ డేస్’ను మళ్ళీ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ రూపంలో రీమేక్ చేసాడన్న విమర్శలను సొంతం చేసుకుని, తన బ్రాండ్ ఇమేజ్ ను తగ్గించుకున్నాడు.

ఇక ‘నిర్భయ’ ఘటనతో చలించిపోయి, ఓ బాలీవుడ్ సినిమాను రీమేక్ చేసి మరో తప్పిదం చేసాడు. ఇలా వరుసగా తప్పటడుగులు వేస్తూ చేజేతులా తన కెరీర్ కు తానే బ్రేకులు వేసుకున్నాడు శేఖర్. సరైన సక్సెస్ అందుకుని ఒక దశాబ్దం గడిచింది. అయితే ఈ పదేళ్ళ కాలంలో కేవలం నాలుగంటే నాలుగు సినిమాలను మాత్రమే తెరకెక్కించారంటే, ఎంత స్లోగా తన సినిమాలను పట్టాలెక్కిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

ఒకప్పుడు ఓవర్సీస్ లో శేఖర్ సినిమాలంటే క్రేజ్. హీరోలలో ఒక్క మహేష్, దర్శకులలో త్రివిక్రమ్, శేఖర్ కమ్ములకు మాత్రమే ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే… తన బ్రాండ్ కంటే కూడా నిర్మాత దిల్ రాజు బ్రాండ్ పని చేయడం. మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “ఫిదా”పై అంచనాలు బాగానే ఉన్నాయి, దానికి తగ్గట్లే ఇండస్ట్రీ వర్గాలలోనూ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది “ఫిదా.”

మరి అదే ఊపులో ప్రేక్షకులను మెప్పిస్తుందా? ఆ అవకాశం అయితే దిల్ రాజు రూపంలో ఖచ్చితంగా లభించింది. నిర్మాతగా, పంపిణీదారుడిగా దిల్ రాజు అండ శేఖర్ కమ్ములకు కొండంత బలం అని చెప్పకతప్పదు. ఎందుకంటే కమ్ములపై నమ్మకం పెట్టుకుని ధియేటర్లకు వచ్చే పరిస్థితిలో ప్రేక్షకులు లేరన్నది వాస్తవం. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రేక్షకులను “ఫిదా” చేయగలిగితే, పునర్వైభవం శేఖర్ సొంతమైనట్లే భావించవచ్చు.