Fidaa Reviews - Sai Pallaviకమర్షియల్ హీరోయిన్ గా ఎంత సక్సెస్ అవుతుందో ఇప్పుడే చెప్పడం కష్టం గానీ, “ఫిదా” వంటి లవ్ ఓరియెంటెడ్ సినిమాలకు ‘భానుమతి’ పాత్ర ద్వారా ప్రాణం పోయడం సాయిపల్లవికి వెన్నతో పెట్టిన విద్యలా కనపడుతోంది. “ఫిదా” సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించలేదు అని ఊహించుకోవడం ఎంత కష్టమో… ఈ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవిని కాకుండా మరొకరిని ఊహించుకోవడం అంతే కష్టమని చెప్పవచ్చు.

సినిమాలో హీరోగా నటించిన వరుణ్ తేజ్ కూడా ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే బాగానే చేసాడు గానీ, సినిమా పూర్తయిన తర్వాత వరుణ్ కంటే సాయిపల్లవినే ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుంటారు. తెలంగాణా యాసలో సొంత డబ్బింగ్ చెప్పడం కూడా ప్రధాన ప్లస్ పాయింట్. సీన్ లో పల్లవి ఉంటే పక్కన ఎవరు ఉన్నది మరిచిపోయి మరీ ఆమె డైలాగ్స్, హావభావాలనే ప్రేక్షకులు చూస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

అయితే ఇంతలా “ఫిదా” చేస్తోన్న సాయి పల్లవి కటౌట్ అగ్ర హీరోలకు సరిపోతుందా? అప్పుడు కూడా ఈ స్థాయిలో మెరుస్తుందా? అంటే ఖచ్చితంగా కాదనే చెప్పవచ్చు. నాడు ‘ప్రేమమ్’లో కూడా ఇలాంటి అభినయాన్నే ప్రదర్శించి మలయాళ ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ, ఈ సారి శేఖర్ కమ్ముల “ఫిదా” రూపంలో తెలుగు ప్రేక్షకులను ముగ్ధమనోహరులను చేస్తోంది.

సాయి పల్లవి కోసం దర్శకుడు శేఖర్ కమ్ముల ఆరు నెలలు ఎందుకు వేచిచూసారో “ఫిదా” చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. అందుకే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ అంతా ఒక్కటే నామస్మరణ చేస్తోంది… అదే… సాయిపల్లవి… సాయిపల్లవి అని..! ఆ మాటకొస్తే… ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు, సినీ విమర్శకులు కూడా సాయిపల్లవికి “ఫిదా” అయ్యారన్న విషయం విశ్లేషణలు చెప్పకనే చెప్తున్నాయి.