Fidaa movie TRP Ratingsచాలాకాలం తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన “ఫిదా” సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకు సిల్వర్ స్క్రీన్ ప్రేక్షకులు నీరాజనం పట్టిన విషయం గతం. తాజాగా బుల్లితెర ప్రేక్షకులు కూడా ఈ “ఫిదా”ను తమ నెత్తిన పెట్టుకున్నారన్న విషయం బయటపడింది. ఇటీవల కాలంలో అగ్ర హీరోల సినిమాలు కూడా బుల్లితెరపై మంచి రేటింగ్స్ ను తెచ్చుకోవడంలో విఫలం అవుతున్న నేపధ్యంలో… ‘ఫిదా’కు మాత్రం అనూహ్యమైన రేటింగ్స్ సొంతం కావడం విశేషం.

మెగా ప్రిన్స్ గా కొనియాడుతున్న వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సాయిపల్లవి ‘సక్సెస్’ క్రెడిట్ అంతా కొట్టేసింది. ‘ఫిదా’ తర్వాత ‘టాక్ ఆఫ్ టాలీవుడ్’ మాత్రమే కాదు, టాక్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీగా మారిన ‘భానుమతి,’ బుల్లితెరపై కూడా తన విశ్వరూపం చూపించిందని చెప్పడానికే ఈ “ఫిదా” టీఆర్పీ రేటింగ్స్ నిలుస్తున్నాయి. సాధారణంగా బుల్లితెరపై సాయంత్రం వేళల్లో ప్రదర్శితం అయ్యే సినిమాలకు కుటుంబం అంతా చూసే అవకాశం ఉంటుంది గనుక, ఎక్కువ రేటింగ్స్ ను సొంతం చేసుకుంటుంటాయి.

కానీ అందుకు విరుద్ధంగా “ఫిదా” మాత్రం మధ్యాహ్నం వేళల్లో ప్రదర్శితమైనా 21.3 పాయింట్స్ ను సొంతం చేసుకుని, ఇటీవల కాలంలో అత్యధిక రేటింగ్స్ ను సాధించిన చిత్రంగా నిలిచింది. ‘బాహుబలి, శ్రీమంతుడు’ సినిమాలకు మాత్రమే ఈ స్థాయిలో బుల్లితెర రేటింగ్స్ దక్కగా, ఆ రేంజ్ సినిమా కాకపోయినా, సాయిపల్లవి మెరుపు నటనతో పెద్ద చిత్రాల స్థాయిలో రేటింగ్స్ ను సొంతం చేసుకోవడం చెప్పుకోదగ్గ విషయమే. దీంతో సినీ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా గుర్తుండిపోయే పాత్రను ఈ ‘హైబ్రిడ్ పిల్ల’ పోషించినట్లుగా అర్ధమవుతోంది.