FCUK (Father Chitti Uma Karthik) censorజగపతి బాబు ప్రధాన పాత్రలో రామ్ కార్తీక్, అమ్మూ అభిరామీ కలిసి నటిస్తున్న చిత్రం ఎఫ్ సియూకే – ఫాదర్, చిట్టి, ఉమా,కార్తీక్. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. చిత్రం టైటిల్ ని తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని, ఇందులో ఎటువంటి బూతుకు ఆస్కారం లేదని… చాలా క్లీన్ సినిమా అని చిత్రబృందం చెప్పుకొస్తుంది.

అయితే ఈ చిత్రానికి అనూహ్యంగా ఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. దీనిపై చిత్ర నిర్మాత దామోదర్ ప్రసాద్… దర్శకుడు విద్యాసాగర్ రాజు ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. “ఈ చిత్రంలో ఒక్క ముద్దు సీన్ కూడా లేదు. కనీసం ఒక కౌగిలింత కూడా ఉండదు. డైలాగులు కూడా సందర్భానికి తగ్గట్టుగానేఉంటాయి,” అని దర్శకుడు చెప్పుకొచ్చారు.

“ఈ సినిమా డైలాగుల కారణంగా ఏ సర్టిఫికెట్ ఇచ్చాం అన్నారు. అయితే సినిమాలో ఒక్క కట్ గానీ ఒక్క బీప్ గానీ ఇవ్వలేదు. ఇవే డైలాగులు ఇంకా పెద్ద సినిమాలలో ఉంటే బీప్ ఇచ్చారు. అయితే ఆ డైలాగులు సినిమాకు అవసరమని, అవి లేకపోతే స్టోరీ కన్వే కాదని సెన్సార్ వాళ్ళు కూడా నమ్మి కట్ ఇవ్వలేదు. వాళ్ళ రూల్స్ వారికి ఉండొచ్చు కానీ సినిమా చూసాక ప్రేక్షకులు క్లీన్ సినిమా అని చెప్తారు,” అని నిర్మాత దాము చెప్పుకొచ్చారు.

“ఈ చిత్రం టైటిల్ చెప్పినప్పుడు నేను ఎంత సేపు ఎఫ్ సియూకే బ్రాండ్ నుండి ఇబ్బంది వస్తుందేమో అనే ఆలోచించా గానీ ఎక్కడా వేరే విధంగా ఇబ్బంది వస్తుందని ఆలోచించలేదు. మన ఉద్దేశం మంచిదైతే ఎటువంటి ఇబ్బంది ఉండదని నమ్మము అందుకే టైటిల్ మార్చలేదు. రేపు సినిమా చూసి ప్రేక్షకులు కూడా అదే చెప్తారు,” అని దాము చెప్పారు.