High Power Committee Formed to Decide the Fate of Amaravatiఅమరావతి భవితవ్యాన్ని నిర్ణయించే హై పవర్ కమిటిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే జీఎన్‌రావు కమిటీ అనంతరం బీసీజీ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు కమిటీ ఇచ్చిన నివేదికలను అధ్యయనం చేయడానికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటి ఏర్పడింది.

దీనిలో బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, ఆదిమూలపు సురేష్, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, పేర్ని నాని, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు, డీజీపీ, ఛీఫ్ కమిషన్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ, మున్సిపల్ మరియు పట్టణాభివృద్ది కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి ఉండబోతున్నారు.

కాగా ఈ హైపవర్ కమిటీకి చీఫ్ సెక్రటరీ.. కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. మూడు వారాల్లోగా కమిటీ నివేదికను ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నీ ఆదేశించారు. బీసీజీ నివేదిక జనవరి మొదటి వారంలోనే ప్రభుత్వానికి అందనుంది. ఈ రెండు నివేదికలను క్రోడీకరించి… ఒక ఫైనల్ రిపోర్టుని ప్రభుత్వానికి హై పవర్ కమిటీ ఇస్తుంది.

ఆ రిపోర్టుని అసెంబ్లీ ముందు పెట్టి, సభ ఆమోదం పొందాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనికోసం ప్రభుత్వం అవసరమైతే జనవరి మూడవ వారంలో ప్రత్యేకంగా సభని సమావేశపరచాలని అనుకుంటుంది. ఈ కమిటీలో కృష్ణ, గుంటూరు జిల్లాల నుండి నలుగురు మంత్రులకు చోటు దక్కడం విశేషం. అమరావతి మార్పు వల్ల ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేది ఈ రెండు జిల్లాలే.