K-Taraka-Ramarao Industries and IT Minister Telanganaఏపీ నుంచి తెలంగాణ విడిపోక మునుపే హైదరాబాద్‌ నగరం చాలా అభివృద్ధి చెందింది. చంద్రబాబునాయుడు హయాంలో ఏర్పడిన హైటెక్ సిటీ తెలంగాణకు ఇబ్బడిముబ్బడిగా ఆదాయం, ఉద్యోగాలకు కొత్త చిరునామాగా మారింది. తెలంగాణ ఏర్పడి, టిఆర్ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌ నగరం మరింత వేగంగా అభివృద్ధి చెందుతోంది.

ముఖ్యంగా తెలంగాణ ఐ‌టి, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ చొరవతో నగరానికి అనేక ఐ‌టి, పరిశ్రమలు తరలివస్తున్నాయి. అలాగే మంత్రి కేటీఆర్‌ చొరవతో నగరంలో ఎక్కడిక్కడ ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారు. నగర సుందరీకరణ పనులలో భాగంగా ఎక్కడిక్కడ గ్రీన్‌ పార్కులు, గ్రీన్‌ సర్కిల్స్, అందమైన శిల్పాలు, ప్రధాన రహదారులలో గోడలపై చక్కటి పెయింటింగ్స్ చేయిస్తూ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. దుర్గంచెరువు కేబిల్ బ్రిడ్జ్, మీరాల చెరువులో మ్యూజికల్ ఫౌంటెన్ నగరానికి ప్రత్యేక ఆకర్షణలు కాగా తాజాగా మరో సరికొత్త ఆకర్షణ జోడించింది తెలంగాణ ప్రభుత్వం.

రాయదుర్గ మెట్రో స్టేషన్ నుంచి మైండ్ స్పేస్ సెంటరు వద్ద వివిద ప్రాంతాలను కలుపుతూ సుమారు 30 అడుగుల ఎత్తున ఒక కిలోమీటరుపొడవునా స్కై వేను నిర్మించింది. అంత ఎత్తు స్కైవే మీద నడుస్తూ చుట్టూ విద్యుత్‌ దీపాలతో దగదగలాడిపోతున్న ఎత్తైన భవనాలను, కిందన పరుగులు తీస్తున్న వాహనాలను చూస్తే చాలా అద్భుతమైన అనుభూతి కలుగుతుంది.

స్కైవే అంటే ఏదో రోడ్లు క్రాస్ చేసేందుకు నిర్మించే ఫుట్‌ ఓవర్ బ్రిడ్జి వంటిది కాదు. దీనికి ఆరుచోట్ల మెట్ల మార్గాలు, 5 ఎస్కలేటర్లు, 4 లిఫ్టులు ఉన్నాయి. కనుక కింద నుంచి పైకి చేరుకోవడానికి ఇబ్బంది పదక్కరలేదు. దీనిని రోజుకి 30,000 మంది ఉపయోగించుకొంటారని అంచనా వేసి అందుకు అనుగుణంగా నిర్మించారు. మొన్న సోమవారమే తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ఈ స్కైవేకి ప్రారంభోత్సవం చేశారు.

దీనిని చూసినప్పుడు ఇటువంటివి మన ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటికైనా చూడగలమా? అని అనిపించకమానదు. బహుశః చంద్రబాబునాయుడు మొదలుపెట్టిన రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయ్యుంటే ఇంత కంటే గొప్ప అద్భుతాలు ఎన్నో మన కళ్ళ ముందు సాక్షాత్కరించేవేమో? కానీ మూడు రాజధానులు…26 జిల్లాలతో నలిగిపోతున్న మన రాష్ట్రంలో ఇవన్నీ సాధ్యం కావని సర్ధుకుపోక తప్పదు.