farmers-stops-minister-seediri-appalaraju-convoyప్రభుత్వం అనేది ప్రజలను ఉద్ధరించే విధంగా ఉండాలి గానీ, ప్రజలను మరిన్ని ఇబ్బందులు పెట్టే విధంగా ఉండరాదు. కానీ ప్రస్తుత వైసీపీ సర్కార్ రెండవ సూత్రాన్నే అవలంబిస్తున్నట్లుగా కనపడుతోంది. రోజుకో కొత్త పన్నులను పెడుతూ “బాదుడే బాదుడు” అన్న జగన్ నానుడిని నిజం చేసే విధంగా సాగుతున్న పరిపాలన ప్రజల్లో తిరుగుబాటుకు కారణమవుతుందా?

పూర్తి స్థాయిలో అవుతుందో లేదో ఇప్పుడే చెప్పలేం గానీ, నేడు పలాసలో జరిగిన వేదికలో మాత్రం ఏపీ ప్రజానీకం తిరుగుబాటుకు సిద్ధమైందన్న సంకేతాలు కనపడుతున్నాయి. ఏపీ మంత్రి అప్పలరాజుని ఓ మహిళ నిలదీసిన వైనం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. “ఓట్లు వేసాం – న్యాయం చేయమని” మహిళ అడిగిన వైనంతో వైసీపీ వర్గం మరియు పోలీసులు ఖంగుతిన్నారు.

ఇది ఒక్క మంత్రినే కాదు, బాధ్యత లేని ప్రతి ఒక్క మంత్రిని, ఆ మాటకొస్తే ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధిని నిలదీసిన నాడే జరిగిన ఎన్నికలకు ఓ అర్ధం, పరమార్ధం ఉంటుంది. ఈ మార్పు ప్రతి ఒక్కరిలో రావాలి, ఇదేదో వైసీపీ మీదనో లేక రాబోయే మరో ప్రభుత్వాన్నో టార్గెట్ చేసినట్లు కాదు, ఓట్లు వేయించుకుని మళ్ళీ నియోజకవర్గాల్లో కనపడకుండా పోయే ప్రతి ప్రజాప్రతినిధికి కనువిప్పు అయ్యేలా ప్రజలు ప్రశ్నించిన నాడే సమాజం అభివృద్ధి చెందుతుంది, నేతలు జాగ్రత్తగా ఉంటారు.

ఇక ప్రస్తుత ప్రభుత్వ విషయానికి వస్తే, జగన్ సర్కార్ మీద ప్రజాగ్రహాం పెచ్చుమీరుతోందని చెప్పడానికి ఈ ఉదంతం ఓ నిదర్శనంగా నిలుస్తోంది. అధికారంలో ఉన్నాము, తామేం చెప్పినా, చేసినా చెల్లుబాటు అవుతుంది, ప్రజలేమీ ప్రశ్నించలేరు అనుకున్న వారికి మబ్బులు తొలగిపోయేలా ఓ మహిళ ప్రశ్నించిన తీరు అభినందనీయం.

రాజధాని విషయంలో, ఓటీఎస్ అంశంలో కూడా ప్రజలు ఇలాగే తమ తిరుగుబాటును ప్రదర్శించిన వైనం తెలిసిందే. ఫలితాలతో నిమిత్తం లేకుండా తమ వంతు ప్రయత్నాన్ని ప్రజలు చేయగలిగితే, మిగిలిన కార్యం ప్రతిపక్ష పార్టీలు అందిపుచ్చుకుంటాయి. టీడీపీ మరియు జనసేన పార్టీలు వైసీపీని ఎండకట్టే విషయంలో పోటీలు పడేటంతగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.