foreign directorsసోషల్ మీడియాలో అభిమానుల అజ్ఞానం నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోతోంది. తమకు అనుకూలంగా అన్వయించుకోవడానికి ప్రముఖులు చెప్పిన మాటలకు కొత్త అర్థాలని వెలికి తీయడం వీళ్ళకే చెల్లింది. ఆస్కార్ సంబరం దగ్గర పడుతున్న వేళ పోటీలో ఉన్న దర్శకులు తమకున్న అవకాశాలను పెంచుకోవడానికి ప్రమోషన్ల వేగం పెంచారు. వీలైనంత ఎక్కువగా వరల్డ్ మీడియాకు ఎక్స్ పోజ్ అయితే గెలిచే ఛాన్స్ పెరుగుతుందని ఆశలు పెట్టుకోవడం తప్పేమీ కాదు. ఆర్ఆర్ఆర్ కు విజయావకాశాలు క్రమంగా మెరుగవుతున్నాయి. అఫీషియల్ నామినేషన్ నాటునాటుకే జరిగింది కానీ అది సాధించినా ఎంతో గొప్పే.

ఇది కాసేపు పక్కనపెడితే తాజాగా స్టీవెన్ స్పీల్బర్గ్ ను రాజమౌళి వీడియో ఇంటర్వ్యూ చేశారు. ఆయన తీసిన ది ఫాబెల్ మ్యాన్స్ రేసులో ఉంది. షిండ్లెర్స్ లిస్ట్, జురాసిక్ పార్క్, ఈటి లాంటి వరల్డ్ క్లాస్ క్లాసిక్స్ తీసిన దర్శకుడితో ముఖాముఖీ అంటే అంతకంటే గర్వకారణం ఏముంటుంది. అందులో భాగంగా స్పీల్బర్గ్ జక్కన్నను పొగడ్తలతో ముంచెత్తుతూ కొన్ని సన్నివేశాల ప్రస్తావన తీసుకొచ్చి ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. రామ్ రామా అంటూ చరణ్ తారక్ ఇద్దరినీ ఉద్దేశించి అన్నారు. అలియా ప్రస్తావన కూడా తెచ్చారు. అయితే ఇది తమ హీరోల గురించేనంటూ ఎప్పటిలాగే ఇద్దరి ఫ్యాన్స్ ట్విట్టర్ లో గోల మొదలెట్టారు.

ఇంకో వైపు టైటానిక్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ఫారిన్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవతార్ మెజీషియన్ జేమ్స్ క్యామరూన్ మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ టాపిక్ తీసుకొచ్చారు. రామరాజు పాత్ర డిజైన్ ని ఉదాహరణగా తీసుకున్నారు. ఇక్కడ ఆయన ఉద్దేశం రాజమౌళి కథను చెప్పే క్రమం ఎంత ఇంటెన్స్ గా ఉంటుందోనని వివరించడానికి. అంతే తప్ప చరణ్ తారక్ లలో ఎవరు గొప్పగా నటించారని చెప్పడానికి ఎంత మాత్రం కాదు. పైపెచ్చు ఆయనకు వాళ్ళ పేర్లు కూడా సరిగా గుర్తు కూడా ఉండవు. ఇలాంటి క్రియేటివ్ జీనియస్ లు మేకింగ్ గురించి తప్ప యాక్టర్స్ గురించి మాట్లాడరు.

సంభాషణను పూర్తిగా అర్థం చేసుకోకుండా ఈ ఇద్దరు దిగ్దర్శకులు తమ హీరోలనే పొగిడారని చెప్పుకోవడం కంటే పెద్ద కామెడీ మరొకటి ఉండదు. గోల్డెన్ గ్లోబ్ ఫంక్టన్ లోనూ క్యామరూన్ రాజమౌళితో నీకు ఇంగ్లీష్ సినిమా తీసే ఆలోచన ఉంటే చెప్పు మాట్లాడుకుందాం అన్నారు కానీ నీ హీరోలు హాలీవుడ్ ఎంట్రీ ఇస్తారేమో కనుక్కోమని అడగలేదు. ఇక్కడ చూస్తేనేమో అనవసరంగా ప్రయాస పడి ట్వీట్లకు రెస్పాన్స్ వస్తుందని లేదా తమ అభిమాన స్టార్ ని ఎలివేట్ చేసుకుంటున్నామని భ్రమలో పడి సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. అయినా అంత లోతుగా ఆలోచించే తర్కమే వీళ్లకు ఉంటే అసలు ఈ వాదనలే జరిగేవి కాదుగా.