Fans surprise on pawan kalyan behaviourప్రత్యేక హోదాపై పోరాడే దమ్ము టీడీపీ, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలకు లేదని, ఆ సత్తా ఒక్క జనసేనకు మాత్రమే ఉందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. రాజకీయాలలో ఒక పార్టీ అలా అనుకోవడం తప్పేమీ కాదు. ఇక్కడ ఎవరి డప్పు వారు కొట్టుకోవాల్సిందే. అయితే ఆయా పార్టీల నిబద్దత బట్టి ప్రజలు ఒక అంచనాకు వస్తారు. అయితే పవన్ కళ్యాణ్ ఆ దిశగా నిరుత్సాహపరుస్తున్నారు.

ఆయన వేసిన నిజనిర్ధారణ కమిటీ రాష్ట్రానికి 76000 కోట్లు రావాల్సిందిగా తేల్చింది. ఏదో మొక్కుబడిగా అరుణ్ జైట్లీని అనడమే గానీ ఆ దిశగా ప్రధానమంత్రిని పవన్ కళ్యాణ్ ప్రశ్నించింది లేదు. అందరిని ఆశ్చర్యపరుస్తూ చంద్రబాబుని బలహీన పరుస్తూ, మోడీ పై ఉన్న ప్రజాగ్రహాన్ని పక్కదారి పట్టించేప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.

అసలు ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ అడిగిన లెక్కలు కూడా కేంద్రం ఇవ్వలేదు. ఆయన వేసిన ఆర్టీఐ అప్లికేషన్ ఏమైందో కూడా ఎవరికీ తెలీదు. దానిగురించి కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా మాట్లాడింది లేదు. అవిశ్వాసం పెడితే అన్ని పార్టీల మద్దత్తు కూడగడతా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ దిశగా ప్రయత్నాలు చెయ్యకపోగా జాతీయ మీడియాలో అవిశ్వాసం అనేది డ్రామా అని ఆరోపిస్తూ ఆ ప్రయత్నాలను బలహీన పరుస్తున్నారు. ఒకానొక సంధర్భంలో అసలు మోడీ స్పెషల్ స్టేటస్ ఇస్తా అని వాగ్దానం చెయ్యలేదని, మాజీ ప్రధాని, వెంకయ్య నాయుడు ఇచ్చిన మాట అని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ లో వచ్చిన ఈ మార్పు సొంత అభిమానులని సైతం విస్మయానికి గురిచేస్తుంది.