Mahesh Babu Tweetచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదాని చిత్తానికి వాడుకుంటూ ఎవరిని ఏమైనా అనొచ్చనే ధోరణి యువతలో విపరీతంగా పెరిగిపోతోంది. అసలు పేర్లు ఫోటోలను దాచిపెట్టి ఫేక్ ఐడిలతో తామేదో స్టార్ హీరోల అఫీషియల్ పిఆర్ లుగా ఫీలయ్యే బ్యాచ్ వేలల్లో కాదు లక్షల్లో ఉంది. ఈ పైత్యమంతా ఎక్కువ శాతం ట్విట్టర్ లోనే ఉంటుంది. వీటి పని ఒకటే. కవ్వించడం, రెచ్చగొట్టేలా బదులివ్వడం, జుగుప్స అనిపించే ట్రోల్స్ చేయడం, వీడియోలు ఆడియోలతో వైరల్ కంటెంట్ సృష్టించడం. ఈ రచ్చ తోడు స్పేస్ లాంటి ఆప్షన్లతో ఆడుకోవడం.

తాజాగా జరిగిన రెండు ఉదంతాలను ఉదాహరణగా తీసుకోవచ్చు. మేం ఫేమస్ టీమ్ ని అభినందిస్తూ మహేష్ బాబు ట్వీట్ చేయడం ఫ్యాన్స్ కి నచ్చలేదు. కోట్స్ లో కామెంట్స్ లో తమ నెగటివిటీని చూపించేశారు. హీరో దర్శకుడు సుమంత్ ప్రభాస్ ఆలస్యంగా స్పందించాడని అతన్నీ టార్గెట్ చేశారు. మేజర్ నుంచి ఛాయ్ బిస్కెట్ టీమ్ తో ఏర్పడ్డ బాండింగ్ బలంగా ఉండటం వల్లే ఇంత చిన్న సినిమాను ప్రోత్సహించడానికి మహేష్ చూసి మరీ అభినందనలు తెలిపాడు. ఇందులో అదే పనిగా తప్పుబట్టడానికి ఏముంది.

Also Read – పోస్టల్ బ్యాలట్‌ కూడా ఇలా బెడిసి కొట్టిందేమిటబ్బా!

మరొకటి జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యే జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు రాలేదనే కారణంతో బాలయ్య ఫ్యాన్స్ ఇటు తారక్ అభిమానులు పరస్పరం బురద జల్లుకోవడం మొదలుపెట్టారు. చేసింది కొందరే అయినా గంటల వ్యవధిలో ఇది అందరి అభిప్రాయమనే రేంజ్ లో వైరల్ అయిపోయింది. నిజానికి ఆ ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేకపోయినా ఇలా కృత్రిమంగా సృష్టించి మరీ రగడ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం చేసుకోవాలి. పైగా ఒకళ్ళను చూసి మరొకరు ఈ రొంపిలోకి దిగుతున్నారు.

రెండు పిల్లులు గొడవపడితే మధ్యలో కోతొచ్చి రొట్టె ముక్క ఎగరేసుకుని పోయినట్టు ఇలా ఒకే స్టార్ ఫ్యామిలీ హీరోల మధ్య అగ్గి రాజుకోవడం యాంటీ ఫ్యాన్స్ కి పండగలా మారింది. వాటిని రీట్వీట్లు చేసి మరీ ఈ వ్యవహారం గురించి తెలియని వాళ్ళను సైతం ఇక్కడికి లాక్కొస్తున్నారు. మరోవైపు రీరిలీజుల కలెక్షన్ల విషయంలో అక్కర్లేని ప్రెస్టీజ్ కు వెళ్లి జేబులు గుల్ల చేసుకుంటున్న అభిమానసంఘాలు పెరిగిపోతున్నాయి. ఇలా ట్విట్టర్ లో ప్రతాపాలు చూపించుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. పైపెచ్చు సామాన్య జనాలకు ఇవన్నీ ఆసక్తి కలిగించేవి కాదు. ఇవి శృతి మించితే ముక్కుమొహం తెలియని ఫేక్ బ్యాచ్ కి ఊడిదేమి లేదు కానీ ఏదైనా చెడ్డపేరు వస్తే అది హీరో మీదే ప్రచారమవుతుంది. వీలైనంత త్వరగా ఈ సత్యాన్ని తెలుసుకుంటే మంచిది.

Also Read – సెకండ్ హాఫ్ లో టాలీవుడ్ దే హవా!