రాను రాను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అతి శృతి మించిపోతోంది. అవసరం లేని చెత్తనంతా తీసుకొచ్చి ట్విట్ల రూపంలో కుప్పలుగా పోయడం చూస్తుంటే బహుశా ఎలాన్ మస్క్ కూడా ఏమీ చేయలేడేమో అనిపిస్తుంది. రోజుకో టాపిక్ మీద ఫ్యాన్స్ వార్ చేసుకోనిదే లక్షలాది టీనేజర్లు, యువత, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు నిద్ర వచ్చేలా లేదు. మొన్న తమిళ హీరో విజయ్ అభిమానులు వరిసు(వారసుడు)లోని ఒక డాన్స్ వీడియో క్లిప్ ని షేర్ చేసి 48 ఏళ్ళ వయసులో ఇలాంటి మూమెంట్స్ ఇచ్చే హీరో ఎవరైనా ఉన్నారా అంటూ పోస్టు పెట్టారు. దీనికి సహజంగా అతని ఫాలోయర్స్ నుంచి భారీ స్పందన వచ్చింది.
నిజానికి వాళ్ళ టార్గెట్లు రెండు. తమకు ప్రత్యర్థిగా భావించే అజిత్ నృత్యం విషయంలో చాలా వీక్ కాబట్టి ఏదో రకంగా ఆ బలహీనతను హైలైట్ చేయడం. రెండోది ఇటీవలి కాలంలో విజయ్ ని రకరకాల కారణాల వల్ల మహేష్ బాబు, ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. నిజానికి కవ్వింపు మొదలయ్యింది అటు వైపు నుంచే. అయితే అనూహ్యంగా ఈ ఇష్యూలో చిరంజీవి అభిమానులు వచ్చేశారు. తాముగా కోరి మరీ మెగాస్టార్ కన్నా విజయ్ డాన్సు బాగా చేస్తాడా అంటూ రకరకాల వీడియో క్లిప్పింగులు జత చేసి మరీ వాదించడం మొదలుపెట్టారు. ఇంకేముంది జరిగేది మీకు అర్ధమయ్యే ఉంటుంది. అర్థం లేని వాదోపవాదాలతో నెటిజెన్లను సైతం ఇందులో లాకొచ్చారు.
తమిళనాడులో ఉన్న ఈ అతి అభిమానమే ఎన్నో విపరీత పరిణామాలకు దారి తీసింది. రోడ్ల మీద కొట్టుకుంటారు. నెగటివ్ గా రాసిన రివ్యూయర్లకు వీడియో కాల్స్ చేసి బెదిరిస్తారు. రిలీజ్ రోజు బెనిఫిట్ షోలకు అల్లరిని హద్దులు దాటిస్తారు. అదో విచిత్రమైన లోకం. మన దగ్గరా ఫ్యానిజం ఉంది మరీ ఇంత తీవ్ర స్థాయిలో లేదు. అందుకే అక్కడ వారసుడు లాంటి రొటీన్ సీరియల్ టైపు కంటెంట్ కూడా మూడు వందల కోట్లు రాబట్టింది. మనం తిరస్కరించిన తెగింపు డబుల్ సెంచరీ చేస్తుంది. వీటిని గమనించుకుంటూ ట్రాప్ లో పడకుండా చూసుకోవాలి కానీ అవసరం లేకుండా రియాక్ట్ అయితే పరిణామాలు ఎక్కడికో వెళ్లిపోతాయి.
ఇదే కాదు ఆ మధ్య ఓజి ట్యాగ్ కోసం స్వంత బాబాయ్ అబ్బాయి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మాములు రచ్చ చేయలేదు. ఇదేం పైత్యం అనిపించే రేంజ్ లో దుమ్మెత్తిపోసుకున్నారు. ఇక్కడ ఎవరూ ఎక్కువ తక్కువ కాదు. సందర్భాన్ని బట్టి ఎవరికి వారు ఫ్యాన్స్ పేరుతో తమ అసలు రంగులను బయట పెట్టుకుంటూ ఉంటారు. పెద్దగా తీరిక లేని బడా స్టార్లు వీటిని అంతగా పట్టించుకోరు కానీ ఇప్పుడిప్పుడే పైకొస్తున్న కుర్ర హీరోలు మాత్రం మరీ పర్సనల్ గా తీసుకుని హర్ట్ అయిన ఉదంతాలు ఈ మధ్యనే చూస్తున్నాం. ఇదంతా ఫేక్ ప్రపంచమని తెలిసినా సరే వీటి గురించి ఆలోచించకుండా సెలబ్రిటీలు, వదలకుండా అభిమానులు నిత్యం ఈ ఎలుకల బోనులో పడుతూనే ఉంటారు.