Saidharam Tej Fan Phone Callపెద్ద హీరోల సినిమాలు నిర్మాణానికి వెళ్లకముందే దానికి సంబంధించిన ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో ఉండటం సహజం. అందులోనూ పవన్ కళ్యాణ్ రేంజ్ స్టార్ అయితే వేరే చెప్పాలా. కానీ తను వరసబెట్టి చేస్తున్న రీమేకులు ఫ్యాన్స్ కే అసహనం కలిగిస్తున్న మాట వాస్తవం. జనసేన నిధులు, తక్కువ సమయం లాంటి కారణాలు ఎన్ని ఉన్నా సగటు మూవీ లవర్ కోరుకునేది కొత్త ఎంటర్ టైన్మెంట్. అంతే తప్ప ఓటిటిలో సబ్ టైటిల్స్ తో సులభంగా దొరికే కంటెంట్ కాదు. ఒకప్పుడంటే ఆన్ లైన్ లేదు కాబట్టి ఎన్ని తీసినా చెల్లిపోయేది కానీ ఇప్పుడలా కాదు.

ఇవాళ వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్ లాంచ్ కు సాయి ధరమ్ తేజ్ గెస్టుగా వచ్చాడు. వెరైటీగా ఉంటుందని స్టోరీలోని కాన్సెప్ట్ ప్రకారం కొత్త నెంబర్లకు ఫోన్లు చేశారు. అందులో ఓ పవన్ ఫాలోయర్ తగిలాడు. వినోదయ సితం రీమేక్ అప్ డేట్ చెప్పన్నా అంటూ తెగ బ్రతిమాలాడాడు. తేజుకే కాదు అక్కడున్న వాళ్లకు లైవ్ లో చూస్తున్న లక్షలాది ఆడియన్స్ కి స్పష్టంగా వినిపించింది. అయినా కూడా సుప్రీమ్ హీరో వినపడలేదు వినలేదు అంటూ పదే పదే రిపీట్ చేయడం తనకు సరదాగా అనిపించినా అవతల రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా అలా అనుకుని ఉండరు.

టైం వచ్చినప్పుడు చెబుతాననో లేదా ఇది సందర్భం కాదని అన్నా సరిపోయేది. అలా కాకుండా తెరమీద నటన స్టేజి మీద చూపించడం కృత్రిమంగా అనిపించిన మాట వాస్తవం. నిజానికి ఈ రీమేక్ వద్దని ఫ్యాన్స్ ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నారు. ఇది థియేటర్ లో వచ్చిన సినిమా కాదు. నేరుగా ఓటిటి రిలీజ్ జరుపుకుంది. ఇంతా చేసి అదేమీ స్టార్లు చేసింది కాదు. సముతిరఖని పాత్రను పవన్ కళ్యాణ్, తంబీ రామయ్య క్యారెక్టర్ ని సాయి ధరమ్ తేజ్ కు సెట్ చేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్తగా మార్పులు చేసిన వెర్షన్ సిద్ధం చేశారని టాక్ ఉంది.

ఇంతా చేసి ఇది కొంచెం గోపాల గోపాల తరహాలో దేవుడికి వ్యక్తికి మధ్య జరిగే మైండ్ గేమ్ లా ఉంటుంది. ఆల్రెడీ ఈ జానర్ లో ఒకటి వచ్చింది. అందులో పవర్ స్టార్ తో పాటు వెంకటేష్ ఉంటేనే ఏదో జస్ట్ హిట్ అనిపించుకుంది. అలాంటిది మళ్ళీ అంటే ఎలా ఉంటుందోననే సందేహం రావడం సహజం. అయినా మామ అల్లుళ్ళు మొదటిసారి కలిసి నటిస్తున్నప్పుడు ఏదైనా క్రేజీ కథను ఎంచుకోవాలి కానీ డిజిటల్ లో అరిగిపోయిన వాటిని కాదనేది నెటిజెన్ల అభిప్రాయం. అయినా వినిపించినా వినిపించని వాళ్ళ ముందు డాల్బీ సౌండ్ లో శంఖం ఊదినా లాభం లేదు ఆయాసం రావడం తప్ప.