ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల హంగామా ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అధికారం అనే ఆధిపత్యంతో జరిగాయని ప్రతిపక్షాలు వాపోతున్నారు. ముఖ్యంగా కుప్పం వేదికగా జరిగిన రచ్చ అంతా ఇంతా కాదని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అడ్డదారులు తొక్కుతూ దొంగ ఓట్లు వేయించుకున్నారని తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది.

నిజానికి కొంతకాలం క్రిందట ముగిసిన పంచాయితీ ఎన్నికలు కూడా అధికార బెదిరింపుల పర్వంలోనే సాగాయని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇలా ఏ చిన్న ఎలక్షన్ వచ్చినా ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ చేస్తోన్న వ్యవహారాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. దారి ఏదైనా తామే గెలవాలన్న భావనతో నకిలీ ఓటర్లను రంగంలోకి దించే వ్యవహారం ప్రజాస్వామ్య రాజకీయాలకు గొడ్డలిపెట్టు వంటిది.

పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరో రెండున్నర్ర ఏళ్ళ తర్వాత జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రజల పీకపై కత్తి పెట్టి మరీ తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకుంటారేమోనని ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలు కోకొల్లలు. ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తే… వాటికి చెక్ చెప్పే విధంగా అధికార పార్టీ నడుచుకోవాలి గానీ, ఏపీలో మాత్రం ఆ విమర్శలకు మరింత ఊతమిచ్చేలా పరిణామాలు జరుగుతుండడం శోచనీయం.