F3 Movie postponedప్రతీ ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర మూడు లేదా నాలుగు బడా సినిమాలు పోటీ పడుతుంటాయి. వచ్చే సంక్రాంతికి కూడా కొన్ని సినిమాలు ఎనౌన్స్ అయ్యాయి. కానీ ఉన్నపళంగా ఎన్టీఆర్ -రామ్ చరణ్ లతో రాజమౌళి తీస్తున్న ‘RRR’జనవరి 7న సంక్రాంతి బరిలో దిగడంతో అనౌన్సయిన సినిమాలన్నీ మెల్లగా పక్కకి జరుగుతున్నాయి. వచ్చే సంక్రాంతికి రిలీజ్ అంటూ ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్న ‘F3’ కూడా సంక్రాంతి బరి నుండి తప్పుకుంది.

వెంకటేష్ – వరుణ్ కాంబోలో అనిల్ రావిపూడి తీసిన ‘ F2’ ఊహించని విధంగా మంచి వసూళ్ళు రాబట్టింది. ఆ ఏడాది సంక్రాంతి సీజన్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతే కాదు దిల్ రాజు కి తక్కువ ఇన్వెస్ట్ మెంట్ తో ఎక్కువ లాభం తెచ్చిపెట్టిన సినిమా ఇది.

అందుకే దానికి హడావిడిగా సీక్వెల్ రెడీ చేసి వెంటనే సెట్స్ పై పెట్టేశారు. నిజానికి సంక్రాంతి రిలీజ్ అనుకొనే షూటింగ్ కూడా మొదలు పెట్టారు. మొన్నటి వరకు అదే డేట్ కి స్టిక్ అయి ఉన్నారు. కానీ ఊహించని విధంగా దిల్ రాజు తన సొంత లాభం కోసం చూసుకొని F3 ని సైడ్ కి జరిపేశాడు అంటూ వెంకీ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

RRR ని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయనున్నాడని తెలిసిందే. ఇప్పుడు డిస్ట్రి బ్యూటర్ గా ఆలోచించి మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నాడని వెంకీ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సంక్రాంతి అంటే ఫ్యామిలీస్ థియేటర్స్ కి వచ్చే అతి పెద్ద సినిమా సీజన్. ఆ టైంలో వెంకటేష్ కి ఫ్యామిలీస్ నుండి అధికంగా టికెట్లు తెగుతాయి. కానీ ఇప్పుడు ఫిబ్రవరిలో రిలీజ్ చేయడం మోసం అంటూ సోషల్ మీడియాలో తమ బాధను వ్యక్తం చేస్తున్నారు విక్టరీ ఫ్యాన్స్. ఏదేమైనా నమ్మిన హీరోలను పక్కన పెట్టి కేవలం డిస్ట్రిబ్యూటర్ గా మాత్రమే ఆలోచించి దిల్ రాజు ఈ నిర్ణయం తీసుకున్నాడని అనుకుంటున్నారు.